దుబ్బాక, ఏప్రిల్ 9: కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా ధాన్యం కొనాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నిర్వాహకులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోవడంతో సగానికిపైగా పంటలు ఎండిపోయాయని, పం డిన పంటలను సకాలంలో కొనుగోలు చేసి, మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం దుబ్బాక మార్కెట్‌యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్, చెల్లాపూర్, దుంపలపల్లి, మండలంలోని హబ్షీపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దుబ్బాకలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ సర్కారులో వానకాలం, యాసంగి రెండు పంటలను బాగా పండాయని, రైతులు పుష్కలంగా నీళ్లు అందినట్లు గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, మద్ద్ధతు ధరకు ధాన్యం సేకరంచి రైతులకు కేసీఆర్ అండగా నిలిచారని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులకు చేయూత కరువైందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వేగంగా ధాన్యం సేకరించి, రైతులకు వేగంగా డబ్బులు చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ ఆదేశించారు. కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, వైస్ చైర్మన్ నరేశ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో భాస్కరశర్మ , ఏవో ప్రవీణ్, దుబ్బాక మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, ఆస యాదగిరి, స్వామి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, మెప్మా, ఐకేపీ, ఏఎంసీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.