సిద్దిపేట, అక్టోబర్ 1: ప్రతి మనిషి దయ, ఓర్పు, శాంతి గుణాలు కలిగి ఉండాలని, అసూయను గెలువకపోతే జీవితం దుర్భరంగా ఉంటుందని బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రెండో రోజు మానవీయ విలువలపై ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసూయను గెలువగలిగినప్పుడు ప్రతి మనిషి జీవితం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రతిఒకరూ చెడు గుణాలను వదులుకోవాలన్నారు.
ఆరోగ్యకర పోటీతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. ప్రయత్నం చేయడం, కష్టపడడంతో విజయం సాధించవచ్చన్నారు. గురువు జ్ఞానాన్ని అందించి, సమాజ అభ్యుదయానికి కారకుడు అవుతాడన్నారు. ప్రతి గురువు ఎలాంటి భేదం లేకుండా తన శిష్యులకు జ్ఞానాన్ని అందిస్తాడన్నారు. ప్రతిఒకరూ రాగ ద్వేషాలకు అతీతంగా ప్రేమతో జీవించాలన్నారు. రెండో రోజు సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. నృత్య ప్రదర్శనలు అలరించాయి.
కార్యక్రమం ప్రారంభానికి ముందు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ప్రవచనాల కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జడ్జి రఘురామ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.