పెద్దశంకరంపేట, జనవరి 21 : దక్షిణకాశీగా పేరుగాంచిన కొప్పోల్ ఉమాసంగమేశ్వర ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. మాఘ అమవాస్య శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు పుణ్య స్నానాలాచరించి స్వయంభూ శివలింగానికి జలాభిషేకాలు నిర్వహించారు. కిష్టప్పగారి సంగమేశ్వర్ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలతోపాటు రేగోడ్,అల్లాదుర్గం, జోగిపేట, నారాయణఖేడ్, కల్హేర్, టేక్మాల్, పాపన్నపేట మండలాల ప్రజలు సుమారు 10 వేల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎస్సై బాలరాజు, ఏఎస్సై అశోక్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చాముండేశ్వరీ ఆలయంలో పూజలు
చిలిపిచెడ్, జనవరి 21 : మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో చాముండేశ్వరీ ఆలయం భక్తులతో రద్దీ నెలకొంది. ఆలయం మంజీరా నది తీరాన ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 20 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మంజీరానదిలో మాఘ స్నానాలు చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదార్, ఎస్సై మహ్మద్‌గౌస్ పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
పేరూరులోని గరుడగంగలో పుణ్యస్నానాలు
మెదక్ రూరల్, జనవరి 21 : మెదక్ మండల పరిధిలోని పేరూరు గ్రామ శివారులోని మంజీరాతీరంలో వెలిసిన సరస్వతీమాత ఆలయంలో పూజారులు రాజమాళీశర్మ, మహేశ్‌శర్మ, గుణాకర్శర్మ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు.
నేటి నుంచిసర్వస్వతీ ఆలయ వార్షికోత్సవాలు
గరుడగంగ సరస్వతీమాత ఆలయ 20వ వార్షికోత్సవా లకు ముస్తాబైంది. ఈ నెల 22 నుంచి 26 వరకు (వసంత పంచమి ) ఐదురోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఘనంగా నర్సింహస్వామి మహోత్సవాలు
రామాయంపేట, జనవరి 21 : పట్టణంలోని నర్సింహ్మస్వామిగుట్టపై బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మాఘ అమావాస్య సందర్భంగా పూజారి వెంకటరమణాచార్యులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాచారు.
రామాయంపేటలోని చిత్తారమ్మ ఆలయంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండోరోజు అమ్మవారికి అభిషేకాలతో పాటు యజ్ఞాలు, హోమాలు నిర్వహించారు.
మంజీరాలో స్నానం చేస్తే జన్మజన్మల పుణ్యం
– రాంపూర్ ఆశ్రమ పీఠాధిపతి మాధవానందస్వామి
కొల్చారం, జనవరి 21 : మాఘ అమవాస్య పురస్కరించుకుని భక్తులు కొల్చారం మండలంలోని మంజీరా తీరంలో భక్తులు పుణ్యస్నానాలాచరించారు. తుక్కాపూర్, వనదుర్గాప్రాజెక్టు, హనుమాన్ బండల్ ప్రాంతంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న మంజీరానదిలో భక్తులు పుణ్యస్నానాలాచరించి దేవతామూర్తులను దర్శించుకున్నారు. రంగంపేట శివారులో ని గురుమధనానంద ఆశ్రమంలో పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి భక్తులకు అనుగ్రహభూషణం చేశారు. మాఘ అమవాస్య రోజు అన్నదానం చేస్తే జన్మజన్మల పుణ్యం వస్తుం దన్నారు. పాపాలను తొలిగించే స్నానాలను మాఘస్నానాలు అంటారని వివరించారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వా త వచ్చే మొట్టమొదటి అమావాస్య అన్నారు. మహాశివుడు లింగ స్వరూపంలో ఆవిర్భవించిన సందర్భంగా మాఘస్నానాలు ఆచరిస్తారన్నారు. గోదావరి నదికి అనుసంధానమైన మంజీరాలో స్నానాలు చేసి అమ్మవారిని, దేవతామూర్తులను కొలుస్తారని మాధవానందస్వామి వివరించారు.
చాకరిమెట్ల ఆంజనేయస్వామికి పూజలు
శివ్వంపేట, జనవరి 21 : మండలంలోని ఆలయాల్లో మా ఘ అమావాస్య సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశా రు. చిన్నగొట్టిముక్లలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వా మి ఆలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. పూజారులు ఆంజనేయశర్మ, దేవదత్తుశర్మ ఎమ్మెల్సీకి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శివ్వంపేటలోని బగలాముఖి శక్తిపీఠంలో ఆలయ ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి నిర్వహిం చారు. ప్రత్యేక పూజల్లో మిషన్‌భగీరథ చీఫ్ ఇంజినీర్ చెన్నారెడ్డి దంపతులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్‌గౌడ్, దాతలు పబ్బ రమేశ్‌గుప్తా, బోళ్ల నర్సింగరావు, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో శక్తిపీఠం ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.