చేర్యాల, డిసెంబర్ 29 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. క్షేత్రంలోని తోటబావి కల్యాణ వేదిక వద్ద జరిగిన కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరశైవ ఆగమశాస్త్రం ప్రకా రం కల్యాణం నిర్వహించగా, పట్టువస్ర్తాలు, ము త్యాల తలంబ్రాలను ఆలయవర్గాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో స్వా మి వారి తరపున పడిగన్నగారి ఆంజనేయులు దంపతులు,అమ్మవార్ల తరపున మహదేవుని భాస్కర్ దంపతులు పాల్గొన్నారు. గర్భగుడిలో జరిగిన కల్యాణోత్సవంలో అమ్మవారి తరపున మహాదేవుని రవి, స్వామి వారి తరపున పడిగన్నగారి మల్లయ్య దంపతులు పాల్గొన్నారు. స్వామి,అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకు లు ఆలయం నుంచి పోలీసుబొమ్మ, రాతిగీరలు, ఆల య పరిసరాల్లో ఊరేగించారు.
మేళతాళాలు, కోలా టం, చెక్క భజనలు, వేద పాఠశాల విద్యార్థుల శివకీర్తనలతో కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. కాశీ పీఠాధిపతి డాక్టర్ మల్లికార్జున శివాచార్య మహాస్వామి వేద పర్యవేక్షణలో కల్యాణం జరిగింది. వీరశైవ ఆగమ పండితులు, పురోహితులు, ఆగమ పాఠశాల వేదపండితులు, ఆగమ విద్యార్థులు కల్యాణోత్సవం నిర్వహించారు. పురోహితులుగా నడిపుడి మఠం భవనయ్య స్వా మి, భువనేశ్వరస్వామి, ఆనందయ్య, జ్ఞానశ్వర్శాస్త్రి, చంద్రశేఖర్‌స్వామి, భద్రయ్యస్వామి వ్యహరించారు. డాక్టర్ మహంతయ్య,నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామీజీ వ్యాఖ్యాతలుగా వ్యహరించారు. భక్తుల కోసం శామియానాలు, చలువ పంది ళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 5గంటలకు రెండు క్వింటాళ్ల బియ్యా న్ని అన్నం వండి రాశిగా తయారుచేసి దిష్టికుంభం తీశారు.
కల్యాణానికి ముందు ఊరేగింపుగా వెళ్లి స్వామి వారి తరపున మహదేవుని వంశస్తులు, పడిగన్నగారి వంశస్తులు కూర్చుని కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణానికి తాళి, మట్టెలు, ఒడిబియ్యం, బట్టలను వారు తీసుకువచ్చారు. మధ్యాహ్నం 12గంటలకు రుద్రాభిషేకం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. స్వామివారికి పట్టువస్ర్తాలు,ముత్యాల తలంబ్రాలను ఆలయవర్గాలు సమర్పించాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి,భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూ రి ప్రతాప్‌రెడ్డి, నాగపురి రాజలింగం, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలలక్ష్మి హాజరయ్యారు.ఆలయ ఈవో ఎ.బాలాజీ, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారు లు బృందం, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, సిబ్బంది కల్యాణోత్సవం సవ్యంగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈసారి గతంలో కంటే భక్తులు తక్కువగా వచ్చినప్పటికీ వారికి సరిపడాసౌకర్యాలు కల్పించడంలో ఆలయవర్గాలు విఫలమైనట్లు విమర్శలు వచ్చాయి. కల్యాణ వేదిక వద్దకు చేరుకునేందుకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికార పార్టీ నేతల హడావిడి కనిపించింది. వీవీఐపీ, వీఐపీ పాసులతో వందల సంఖ్యలో నాయకులు తరలిరావడంతో గ్యాలరీలు నిండిపోయాయి. డోన ర్లు, భక్తులకు కుర్చీలు లేకుండా పోయా యి.
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి వచ్చిన సమయంలో పార్టీ నాయకులు వందల సంఖ్యలో కల్యాణ వేది క ప్రదేశానికి దూసుకురావడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. జోగిని శ్యామల, క్రాంతిని ఆలయవర్గాలు కల్యాణ వేదిక పైకి వెళ్లేందుకు అనుమతించారు. మరికొంత మంది జోగినీలకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు గంటల పాటు కల్యాణ వేదిక కిందనే ఒడిబియ్యంతో వేచి ఉండి తమను ఎందుకు రానివ్వడం లేదని ఆలయవర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం సందర్భంగా ఎన్నడూ లేనివిధంగా ఆలయ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భక్తుల మధ్య కూర్చొని స్వామి కల్యాణాన్ని వీక్షించారు. వేదికపై అధికార పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూర్చోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు.
క్షేత్రంలోని ప్రధాన వీధులు చిత్తడిగా మారడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజగోపురం నుంచి మల్లన్న కల్యా ణ వేదిక వద్దకు వచ్చే ప్రధాన రోడ్డుపై నీళ్లు నిలవడంతో బురదమయంగా మారింది. బస్టాండ్ సమీపంలో కుక్క మృతి చెందినప్పటికీ దానిని తొలిగించకపోవడంతో అటువైపుగా ప్రయాణించిన భక్తులు అసౌకర్యానికి గురయ్యారు.