చేర్యాల, జూన్ 27: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రానికి సమీపంలో రాజీవ్హ్రదారి ఆనుకుని నిర్మిస్తున్న రైల్వేస్టేషన్ పనులకు మోక్షం లభించడం లేదు. కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రానికి ప్రతి ఆదివారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి ఉత్సవాల సమయంలో లక్షల్లో, మిగిలిన రోజుల్లో వేలాదిగా భక్తులు బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వ్యయప్రయాసాలు పడుతూ కొమురవెల్లికి వస్తున్నారు. దీంతో భక్తుల సౌకర్యార్థం ఆలయానికి సమీపంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి కేంద్రానికి నివేదికలు పంపించింది.
రైల్వేస్టేషన్‌కు సంబంధించిన తమవంతు భూసేకరణ చేయించడంతో పాటు నిధులు సైతం నాటి బీఆర్ఎస్ సర్కారు కేటాయించింది. 2024 ఫిబ్రవరిలో రైల్వేస్టేషన్ పనులు ప్రారంభించిన సంబంధితశాఖ అధికారులు ఈ సంవత్సరంస్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రారంభంలోనే రైలు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పనులు పూర్తి కాక వాయిదా వేస్తూ వస్తున్నారు.తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం చర్లపల్లి టెర్మినల్ ప్రారంభ సమయంలో దసరా రోజు కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ ప్రారంభమవుతుందని ప్రకటించారు.కానీ వాయిదాల పర్వం కొనసాగుతుందా లేక ప్రారంభమవుతుందా అని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దర్శంచుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతి ఏటా 25లక్షల మందికి పైగా భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి వస్తుంటారు.సరైన ప్రయాణ సౌకర్యాలు లేక నానా తిప్పలు పడుతున్నారు.బస్సుల్లో వచ్చే వారంతా రాజీవ్ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే కొమురవెల్లికి చేరుకోవడానికి తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికులు ప్రధాన రహదారిపై గంటలపాటు నిరీక్షించాల్సిందే. రైల్వే స్టేషన్ నిర్మాణంతో మల్లన్న భక్తులతో పాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజలకు రైలు ప్రయాణం దరిచేరుతుంది.
మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య రైలు మార్గం పూర్తయితే కొమురవెల్లితో పాటు వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, కోటిలింగేశ్వరస్వామి ఆలయాలకు వెళ్లేందుకు ప్రయా ణం అందుబాటులోకి వస్తుంది.దీంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్, కరీంనగర్ వరకు ప్రయాణ సౌక ర్యం కలుగుతుంది. నిర్మాణ పనులు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ మహేందర్‌రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, ఆర్కిటెక్చర్ పని పెండింగ్‌లో ఉందని మరో 10రోజుల్లో తమ కు కేటాయించిన ప నులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తి చేసి తనవంతు నిధులు కేటాయించడంతో కేంద్ర ప్రభుత్వం రూ.1,160కోట్ల అంచనాతో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 151కిలోమీటర్ల దూరం రైల్వేలైన్ నిర్మాణ పనులు చేపట్టింది.ఈ మార్గంలో 15 స్టేషన్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు.అందులో రూ.3కోట్లు ఖర్చు చేసి కొమురవెల్లి సమీపంలో రైల్వేస్టేషన్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. 2025 జాతర సమయంలో జనవరి 15 నుంచి రైల్వేస్టేషన్ పనులు పూర్తి చేసి రైలు నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు భావించగా, పనులు పూర్తి కాకపోవడంతో దానిని అమలు చేయలేదు.
రైల్వేస్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్, వెయిటింగ్‌హాల్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు, రైల్వే సిబ్బంది కార్యాలయ గది పనులు పూర్తయ్యాయి. రైల్వేస్టేషన్ ముఖద్వారం దగ్గర దేవాలయ ఆర్చ్ నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. రైల్వేస్టేషన్ కోడ్‌ను సంబంధిత అధికారులు ఇప్పటి వరకు కేటాయించలేదు.దీంతో పాటు ముఖ్యమైన విద్యుత్ సౌకర్యాన్ని ఇప్పటి వరకు కల్పించకపోవడంతో జనరేటర్ సహాయంతో పనులు చేస్తున్నారు.