చేర్యాల, సెప్టెంబర్ 5: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో 50 కాటేజీల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. అధికారుల పట్టింపులేని తనంతో ఏండ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం బీఆర్ఎస్ హయాంలో రూ.10.95 కోట్ల (స్పెషల్ డెవలఫ్‌మెంట్ ఫండ్ రూ.6.80కోట్లు, ఆలయ నిధులు రూ.4.15 కోట్ల)తో జీ ప్లస్ టుతో నిర్మాణ పనులు ప్రారంభించగా, ఏడేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి వచ్చే భక్తులు ప్రైవేట్ గదులు అద్దెకు తీసుకుని బసచేస్తున్నారు. డిసెంబర్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటికి కాటేజీలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ మల్లన్న క్షేత్రంలో స్వామి అభివృద్ధి పనుల కోసం రూ.10కోట్లు కేటాయించారు.ఆ నిధులతో ఆలయ సమీపంలోని బస్టాండ్ వెనుక భాగంలో 50 కాటేజీలు నిర్మించేందుకు 2018 ఆగస్టులో రూ.6.80 కోట్లు, మిగిలిన నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. గుట్టపై కాటేజీలు నిర్మిస్తే ప్రతిపాదిత నిధులు సరిపోవని పంచాయతీరాజ్‌శాఖ అధికారుల సూచనలతో ఆలయ నిధులు రూ.6 కోట్లు మంజూరు చేశారు.
మొదటగా రూ.3. 60 కోట్లతో రోడ్డు పనులు పూర్తి చేశారు.కాటేజీల కోసం అధికారులు టెండర్లు ఆహ్వానించగా, కాంట్రాక్టర్ 2018లో పనులు ప్రారంభించాడు.నిబంధనల మేరకు రెండేండ్లలో పనులు పూర్తి చేయాలి. కానీ, కాంట్రాక్టర్ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం తో అధికారులు పలుమార్లు గడుపు పొడిగిస్తూ వచ్చారు. గతేడాది బ్రహ్మోత్సవాలకు కాటేజీల భవనం అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, కార్యరూపం దాల్చలేదు.కాంగ్రెస్ సర్కారు వచ్చాక పనులు నెమ్మదించాయి. ఎస్డీఎఫ్ ఫండ్స్ రూ.6. 80 కోట్లు పోగా, ఆలయం నుంచి కాటేజీల నిర్మా ణం కోసం రూ.4.15కోట్లు మం జూరు చేసి చెల్లించారు. అయినా ఇంకా 20శా తం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి నిత్యం భక్తులు వందలాదిగా వస్తుంటారు. జాతర, బ్రహ్మోత్సవాల సమయంలో వేలాదిగా భక్తులు వస్తారు.స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల్లో సగానికి పైగా శనివారం, ఆదివారం రోజుల్లో, మరికొందరు ఒక్కరోజు మాత్రమే మల్లన్న క్షేత్రంలో రాత్రి బస చేస్తారు. కాటేజీలు పూర్తిచేసి గదులు అందుబాటులోకి తేవడంలో పంచాయతీరాజ్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో భక్తుల పాలిట శాపంగా మారింది.
కాంట్రాక్టర్ పను లు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఆలయ అధికారులు పంచాయతీరాజ్ శాఖ ద్వారా పనులు చేయించేందుకు ఆలయవర్గాలు నిర్ణయించాయి. సంబంధిత అధికారికి పనుల నిర్వహణ బాధ్యతలు అప్పగించి పను ల సామగ్రి తదితర వాటి కొనుగోలు, చెల్లింపుల కోసం రూ.50లక్షల మంజూరు చేశారు. ఈ చెక్కును సైతం అధికారి పేరిట ఇచ్చినప్పటికీ పనుల్లో పురోగతి లేదు. తాజాగా పనుల నిర్వహణ కోసం రూ.90లక్షలతో రివైజ్డ్ ప్రతిపాదనలను పంచాయతీరాజ్‌శాఖ అధికారులు రూపొందించారు.
ఆలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన 128 గదుల్లో 90 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందు లో కొన్ని కార్యాలయాల కోసం వినియోగిస్తుండగామరిన్ని శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని వినియోగించడం లేదు. గదులు సరిపడా లేక భక్తులు ప్రైవేట్‌లో కిరాయికి తీసుకుంటున్నారు. భక్తులు భారీగా వచ్చినప్పుడు గదుల అద్దెలు భారీగా వసూలు చేస్తుండడంపై భక్తులపై ఆర్థిక భారం పడుతున్నది.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో నిర్మిస్తున్న 50 కాటేజీల భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటా. తాను ఇటీవల విధుల్లో చేరా. కాటేజీల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడి రానున్న జాతర వరకు అందించాలని భక్తులు కోరుతు న్నారు. కాటేజీ నిర్మాణాలు పూర్తి చేస్తే భక్తులకు ఎంతో ఉపయోగపడుతాయి.
– టంకశాల వెంకటేశ్, డిప్యూటీ కమిషనర్ కొమురవెల్లి, సిద్దిపేట జిల్లా