చేర్యాల, జనవరి 1: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఈవోగా దేవాదా య శాఖ డీసీ కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులును మల్లన్న ఆలయ ఈవోగా మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈవో గా బాధ్యతలు స్వీకరించారు.
నాలుగు సంవత్సరాలుగా ఈవోగా విధులు నిర్వహించిన ఆలూరి బాలాజీశర్మ ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో రామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మల్లన్న ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, ఆలయ అర్చకులు, ఒగ్గు పూ జారులు ఆయనకు అభినందనలు తెలిపారు.
కొ మురవెల్లి మల్లన్న ఆలయంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు చిన్నచూపు చూస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన దేవాలయానికి రాష్ట్ర కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారిని పూర్తి అడిషనల్ చార్జి పేరిట ఈవోగా నియమించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో విధులు నిర్వహించిన ఈవో బాలాజీ సైతం దేవాదాయ శాఖ హైదరాబాద్ ఏసీగా విధులు నిర్వహించారు. ఆయన్ను సైతం ఎఫ్ఏసీ ఈవోగా కొమురవెల్లి ఆలయానికి నియమించడంతో నాలుగేండ్లు విధులు నిర్వహించారు.