KGBV | రాయపోల్, మార్చి 12 : రాయపోల్ మండల కేంద్రంలో కస్తూర్భాగాందీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మూడేండ్లు గడుస్తున్న పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కస్తూర్భాగాందీ పాఠశాల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. తెలంగాణ ప్రభుత్వ హయంలో 2022 ఏప్రిల్ 28న అప్పటి మంత్రి హరీశ్‌రావు, అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే రఘనందన్‌రావులు శంకుస్ధాపన చేశారు. సంవత్సరంలో పూర్తి చేయాల్సిన పనులు ఏకంగా మూడేండ్లు దాటిన పాఠశాల అందుబాటులో రాకపోవడంతో విద్యార్థినులు అద్దె భవనంలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
ఏడేళ్ల క్రితం రాయపోల్ మండల కేంద్రంలో కేజీవీబీ పాఠశాల ప్రారంభమైంది. ఈ పాఠశాల ఓ ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 200 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్ధాయిలో విద్యను అందిచాలనే లక్ష్యంతో కేజీవీబీ పాఠశాలకు అధునాతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాయపోల్‌లో కేజీవీబీ భవన నిర్మాణానికి సర్వశిక్షా అభియాన్ పథకంలో రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేశారు. రాయపోల్-కొత్తపల్లి గ్రామాల మధ్యలోని రోడ్డు ప్రక్కన విశాలమైన కస్తూర్భాగాందీ పాఠశాలకు భూమిని ఇచ్చారు. ప్రారంభ దశలో నిర్మాణ పనులు జరగగా అంతలోనే పనులు అగిపోవడంతో పాటు కాంట్రాక్టర్లు తరుచుగా మారడంతో పాటు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో కస్తూర్భాగాందీ పాఠశాల భవన నిర్మాణ పనులు మూడేండ్లు గడుస్తున్న పూర్తి చేయకపోవడంతో వివిధ గ్రామాలకు చెందిన విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దె భవనంలోనే విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్భాగాందీ పాఠశాల కలగానే మిగిలిపోయింది. కొత్త భవనం నిర్మాణం జరిగితే విద్యార్ధినిలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు అవకాశం ఉన్నప్పటికి భవన నిర్మాణం పూర్తి కాకపోవడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
రాయపోల్ మండల కేంద్రంలోని కొత్తపల్లి శివారులో కస్తూర్బాగాందీ పాఠశాల నిర్మాణ పనులు యుద్దప్రతిపాదికన పూర్తి చేయాల్సింది పోయి సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసే విధంగా అధికారులు బిల్లులు తొందరగా ఇప్పించి కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులు పూర్తి చేయించాల్సిన అధికారులు కుడా ఇటు వైపు తొంగి చూడడంలేదు. ఈడబ్ల్యూ ఐడీసీ అధికారులు ఇప్పటికైన కస్తూర్బాగాందీ పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయించి వచ్చే విద్యాసంత్సరంలోనైన అందుబాటులో వచ్చే విధంగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై ఈడబ్ల్యూ ఐడీసీ ఏఈ షఫీని వివరణ కోరగా రాయపోల్ మండల కేంద్రంలోని కస్తూర్భాగాందీ పాఠశాల నిర్మాణా పనులు వచ్చే విద్యసందత్సరంలోపు పూర్తి చేయించేందుకు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వచ్చే విద్యా సంవత్సరం వరకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.