మెదక్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో పాలనంతా ఇన్‌చార్జిలపైనే నడుస్తున్నది. కీలకశాఖలకు అధికారులు లేక పాలన కుంటుపడుతుంది. ఆయా శాఖలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఎక్కడి ఫైళ్లు అక్కడే పెండింగ్‌లో ఉంటున్నాయి. మెదక్ కలెక్టరేట్లో సుమారు 40 నుంచి 46 శాఖలు ఉన్నాయి. ఇందులో 12 శాఖలకు వేరే శాఖల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులే ఖాళీగా ఉన్న శాఖల అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇన్చార్జిలుగా, అదనపు బాధ్యతలు చేపట్టిన వారంతా తమ శాఖలకు సంబంధించిన పనుల్లో తలమునకలై ఉంటుండగా అదనపు బాధ్యతలు తీసుకున్నశాఖలపై దృష్టి సారించలేకపోతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పూర్తి స్థాయిలో
బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా ఆవిర్భవించింది. అన్ని శాఖలకు అధికారులను నియమించింది. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మెదక్ కలెక్టరేట్లోని ఆయా శాఖ ల్లో ఉన్న అధికారులు కొంత మంది ఉద్యోగ విరమణ పొందారు. కొంత మంది అధికారులు బదిలీల్లో వేరే స్థానాలకు వెళ్లారు. దీంతో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు.
కీలక శాఖల్లోనూ..
జిల్లాలో అత్యంత కీలకమైన శాఖలకు ఇన్‌చార్జిలే దిక్కయ్యారు. డిసెంబర్ 31న మై నింగ్ ఏడీ ప్రవీణ్ ఉద్యోగ విరమణ పొందా రు. ఆ తర్వాత మైనింగ్ శాఖకు ఇన్చార్జిలను నియమించలేదు. బీసీ సంక్షేమశాఖలో సంగారెడ్డి బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్‌కు మెదక్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీపీవో అదనపు ఇన్చార్జిగా ఎం.బద్రీనాథ్ కొనసాగుతున్నారు. పరిశ్రమలశాఖ మేనేజర్‌గా సంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ హరినాథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిలా ్లపశువైద్యాధికారి విజయశేఖర్‌రెడ్డి ఉద్యోగ విరమణ పొందారు.
ఆ తర్వాత ఆ శాఖకు జిల్లా పశు వైద్యాధికారిగా వెంకటయ్యను ఇన్చార్జిగా నియమించారు. జిల్లా వ్యవసాయశాఖకు ఇన్చార్జిగా విసెంట్ వినయ్‌కుమార్‌కు అప్పగించారు. జిల్లా కో ఆపరేటివ్ అధికారి కరుణ బదిలీపై వెళ్లగా ఇన్చార్జిగా కరుణాకర్ బాధ్యతలు చేపట్టారు. ఎక్సైజ్‌శాఖ జిల్లా ఇన్చార్జిగా శ్రీనివాస్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఏహెచ్ ఇన్చార్జిగా సతీశ్యాదవ్కు బాధ్యతలు అప్పగించారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా టీ.రాజును ఇన్చార్జిగా నియమించారు. హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ ఇన్చార్జిగా శ్రీకాంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. జిల్లా ట్రెజరరీ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సత్యసోమేశ్వర్రావును ఇన్చార్జిగా నియమించారు.