పబ్జీ ఆడనివ్వడం లేదని దాడి.. ఫోన్ కొనివ్వడం లేదని ఆత్మహత్య.. చిన్నారిపై లైంగికదాడి..విద్యార్థినులకు వేధింపులు..అర్ధరాత్రి వరకు విందులు.. స్నేహితులతో వినోదాలు..విపరీతమైన స్వేచ్ఛతో నేటి యువతరం పెడదోవ పడుతోంది.తల్లిదండ్రుల అతి గారాభం, ఏం చేసినా నడుస్తుందిలే.. అన్న భావనతో నేరాల వైపు మళ్లుతున్నారు. లేత వయస్సులో మద్యం, డ్రగ్స్, గంజాయికి బానిసవుతూ విలువైన జీవితాన్ని బుగ్గిపాల్జేసుకుంటున్నారు. ప్రేమ మోజులో పడి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం నేపథ్యంలో మన పిల్లలు ఎంత భద్రంగా ఉన్నారో కన్నేసి ఉంచాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. లైంగికదాడికి పాల్పడిన వారంతా మైనర్లే కావడంతీవ్ర చర్చనీయాంశమైంది. తల్లిదండ్రుల సత్సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు, సమాజ విలువలను చిన్ననాటి నుంచే నేర్పించాలని హితవు పలుకుతున్నారు. తరచూ పిల్లలతో మాట్లాడుతుండడం, వారి కదలికలు, ప్రవర్తనపై కన్నేసిఉంచడంతోపాటు వారితో ప్రేమగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
సిటీబ్యూరో, జూన్ 21 ( నమస్తే తెలంగాణ ): క్యాబ్ ఎక్కాలన్నా.. రైలులో ప్రయాణించాలన్నా.. స్నేహితులతో కలిసి ఉండాలన్నా.. పక్కింటి వారితో కాస్త చనువుగా మాట్లాడినా.. అంతెందుకు ఇంట్లోని వారితోనే ఓ మృగం కాచుకునిఉంటే ఎలా తప్పించుకునేది? కఠిన శిక్షలు విధించినా మళ్లీ అవేసంఘటనలుఎందుకుపునరావృతమవుతున్నాయి? దేశంలో ఎక్కడో చోట బాలికపై లైంగికదాడి.. యువకుడు డ్రగ్స్‌కు బలి.. తాగుడుకు బానిసైన మైనర్.. ఇలా ఎన్నో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి భయానక పరిస్థితుల్లో మన పిల్లలు ఎంత వరకు క్షేమంగా ఉన్నారు? వారికి ఎలాంటి విలువలు నేర్పిస్తున్నాం? వారి ప్రవర్తన ఎలా ఉంది..? తదితర విషయాలపై పేరెంట్స్ మేల్కోపోతే వారి బంగారు భవిత కూలిపోనుంది. వారి వికృత ఆలోచనలను గుర్తించి అడ్డుకట్ట వేయకపోతే జీవితాలు ఛిన్నాభిన్నంగా మారనున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమ్మా..నాన్నల ప్రేమ పిల్లలకు బలమవ్వాలి. వారి ఐకమత్యం ఆదర్శంగా నిలవాలి. వారి పెంపకం సమస్యలను పరిష్కరించుకోగలిగే చాతుర్యతను ఇవ్వాలి. డబ్బు సంపాదించి ఇవ్వడమే జీవితం కాదు. మంచి పేరెంటింగ్ పిల్లల కష్టసుఖాల్లో ఓదార్పునివ్వాలి. వారి స్నేహపూర్వక విధానం నూతనోత్తేజాన్ని కలిగించాలి. అయితే ఈ విధానం ప్రస్తుత బిజీ లైఫ్‌లో కొరవడుతుంది. పిల్లలతో ఫ్రెండ్లీ పేరెంటింగ్ లోపిస్తుంది. పని ఒత్తిడి, దంపతుల పొరపొచ్చాలు పిల్లలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఘర్షణ పిల్లల లేత మనసులను కుంగదీస్తున్నాయి. ఫలితంగా చిన్నారులు తమ విజయాలకు దూరం అవుతున్నారు. ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్, సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పబ్లిక్ లైబర్రీ ఆఫ్ సైన్స్(జర్నల్) జరిపిన తాజా స్టడీలో పేరెంట్స్ ఒత్తిడి కారణంగా పిల్లలు మైల్‌స్టోన్స్‌ను అధిగమించడంలో వెనకబడిపోవడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు చేరువవుతన్నారని పేర్కొంది. గతంలో అడొల్సెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్(ఏబీసీడీ) స్టడీ కూడా తల్లిదండ్రుల నిరాశ పిల్లలకు శాపంగా మారుతుందని వెల్లడించింది.
ప్రతి మనిషిలో సిక్త్ సెన్స్ ఉంటుంది. అదొక అద్భుతమైన శక్తి. మనం చేసే పని.. తీసుకునే నిర్ణయం సరైనదా ? కాదా? అనే విషయాలపై సిక్త్ సెన్స్ హెచ్చరిస్తుంటుంది. దానిని మనం తేలికగా తీసుకోవద్దు. చాలా సందర్భాల్లో సిక్త్ సెన్స్‌తో ప్రమాదాల నుంచి బయటపడిన వారూ ఉన్నారని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ప్రముఖ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ లిండ రినామన్ తన అధ్యయనంలో సిక్త్ సెన్స్ శక్తిని గుర్తించింది. సిక్త్ సెన్స్‌తో మెదడుకు వెళ్లే సంకేతాలు ఎమోషన్స్, నిర్ణయాలు, మూడ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని ప్రకటించారు. ఈ విషయాలను ఫిజియాలజీ పేపర్లో ప్రచురించారు. సిక్త్ సెన్స్‌తో ప్రమాదాలను గుర్తించొచ్చని తేల్చారు.
ప్రేమ అంటే పిల్లలకు ఆరోగ్యకర వాతావరణ ఇవ్వడం.. గారాబం అంటే హానికరమనేదే అని గుర్తుంచుకోవాలి. ఏం చేసినా మా పేరెంట్స్ చూసుకుంటారు అనే ఆలోచన వారికి రాకుండా జాగ్రత్త పడాలి. తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్ష ఎదుర్కోవాల్సిందేననే అవగాహన కలిగించాలి. అతి గారాబం పనికిరాదు. పిల్లలు బయటకు వెళ్లినప్పుడు అనుకున్న సమయానికి ఇంటికి రాలేకపోతే ఆలస్యం అవుతుందని కూడా చెప్పరు. మాట మీద ఉండరు. ఏదైనా ఒక మాట అన్నా నానాబీభత్సం చేస్తారు. అది మాన్పించగలగాలి. సెలవుల్లో వారిని ఏమైనా సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండేలా చూడాలి.
– నందిత, వ్యక్తిత్వ మానసిక నిపుణులు
పిల్లల ప్రవర్తనలో తేడా కనిపిస్తే వెంటనే గుర్తించాలి. సరైన చికిత్స అందిస్తే పరిస్థితి మెరుగవుతుంది. తల్లిదండ్రులు నిరాశ, నిస్ప్రహలకు లోనవ్వకుండా సరైన ప్రణాళిలు చేసుకుని జీవితాన్ని లీడ్ చేయాలి. సాధారణంగా కుంటుంబంలో తల్లిదండ్రుల నుంచే చిన్నారులు జీవిత పాఠాలు నేర్చుకుంటారు. మంచి, చెడును విశ్లేషించి.. తెలివితేటలను నేర్పించేది వారే. కానీ ప్రస్తుత పరిస్థితులు కాలంతో పాటు పరుగెత్తేలా ఉన్నాయి. ఈ స్థితిలో తల్లిదండ్రులు ఎక్కువ సంఖ్యలో డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఉదయం వెళ్లి.. రాత్రి ఎప్పడోగానీ ఇంటికి వస్తున్నారు. పిల్లలతో సరదాగా గడిపే అవకాశాలు ఉండటం లేదు. దీంతో వారి ప్రవర్తనలో మార్పు వచ్చి.. నెగెటివ్‌గా ప్రవర్తిస్తున్నారు. అది చిన్నారులపై విష ప్రభావాన్ని చూపిస్తుంది.
– మోత్కూరి రాంచంద్రం, సైకాలజిస్టు
పిల్లలను ఒంటరిగా వదలడం ప్రమాదకరం. అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా సైకోమెట్రిక్ టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంది. స్కూళ్లు, కాలేజీలు, ఇతర అన్నీ ఆర్గనైజేషన్లలో చేయాలి. దీనివల్ల ఎలాంటి మానసిక రుగ్మతలతో ఎవరెవరూ బాధపడుతున్నారో తెలుస్తుంది. వారిని సైకియాట్రిస్టు దగ్గరకు పంపిస్తారు. నేరాలు చేసి జైలుకు వెళ్లిన వారి ప్రవర్తన ఎలా ఉందో జైళ్ల శాఖ వారు ప్రొఫైల్ రెడీ చేయాలి. ఎలాంటి ఆటిట్యూడ్ వారు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారో గుర్తించి మేల్కోవచ్చు.
– డాక్టర్ సి. వీరేందర్,సైకాలజిస్టు.
ఇన్ట్యూషన్ ప్రతి మనిషిలో ఉంటుంది. చాలా మందిలో నిద్రాణవస్థలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలు, క్లూస్ లేకుండా ఏదో జరుగుతుందని అనిపించడమే సిక్త్ సెన్స్. ఈఎస్పీ(ఎక్ట్స్రా సెన్సరీ పర్సెప్షన్) అనేది కొంతమందిలో యాక్టివేట్ అవుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ముందే తనకు తెలుసని..చెబుతారు. అది ఈఎస్పీ. అందులో భాగమే సిక్త్ సెన్స్. సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయి ఇలా చేస్తే బాగుండని డైరెక్షన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మనం మెదడు పనితీరును సరైన విధంగా ఉపయోగిస్తే యోగులుగా శక్తులు సంపాదించుకోవచ్చు.
– డాక్టర్ స్వాతి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్,డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ,ఉస్మానియా యూనివర్సిటీ
ప్రశాంతంగా జీవించగలిగితే ఇన్ట్యూషన్ వపర్‌ను పొందొచ్చు. యోగా, మెడిటేషన్‌తో ఈ పవర్‌ను పెంచుకోవచ్చు. ఒత్తిడి, తీవ్ర ఆలోచనలు చేసే వారిలో సిక్త్ సెన్స్ పవర్ కాస్త తక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ప్రమాదకర పరిస్థితుల్లో ఇన్ట్యూషన్ పవర్‌తో కాపాడుకోవచ్చు. అక్కడి పరిస్థితులు మనల్ని ఏ విధమైన ఆలోచనలకు దారి చూపిస్తున్నాయో గమనించి అలర్ట్ కావాలి. నిర్లక్ష్యం చేయకూడదు.
– డాక్టర్ జి.సి. కవిత,కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్.