రామచంద్రాపురం, ఏప్రిల్14: రాష్ట్రంలో కురుమ జాతిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కురుమ సంఘానికి చెందిన ఎగ్గె మల్లేశంను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం తెల్లాపూర్‌లో బీరప్ప జాతరకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఇంతపెద్ద బీరప్ప జాతర ఎక్కడా చూడలేదన్నారు.
ఈ ప్రాంతం హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నప్పటికీ ఇక్కడి మహిళలు గంపలను ఎత్తుకొని స్వామివారికి ఒడిబియ్యం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీరప్ప ఆలయం కోసం భూమి కావాలని కురుమ సంఘం పెద్దలు తన దృష్టికి తీసుకువచ్చినప్పుడు, హెచ్ఎండీఏ అధికారులు రూ.40కోట్లు విలువ చేసే భూమిని ఎలా ఇస్తామని చెప్పారని, గ్రామ అవసరాల కోసం భూమిని కేటాయించాలని అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి అలిగి తన పదవికి రాజీనామా చేస్తానని కాగితం కూడా ఇచ్చారని గుర్తుచేశారు.
ఆయనతో రాజీనామా చేయించకుండా అప్పుడు సీఎం కేసీఆర్‌తో చర్చించి గ్రామస్తుల డిమాండ్‌ను చెప్పి బీరప్ప ఆలయం కోసం ఎకరం భూమిని, ఇతర అవసరాల కోసం ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి కేటాయించినట్లు గుర్తుచేశారు. కురుమల ఆరాధ్య దైవం కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ చైర్మన్‌గా మొదటిసారి కురుమని చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మల్లన్నసాగర్‌కు ఆ దేవుడి పేరును కేసీఆర్ పెట్టారని గుర్తుచేశారు.
మల్లన్న స్వామి అంటే కేసీఆర్‌కి ఎంతో నమ్మకం, ఏ ముఖ్యమంత్రి కూడా మల్లన్న స్వామికి పట్టు వస్ర్తాలు సమర్పించలేదని..పట్నం వేయలేదని, మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వమే మల్లన్న స్వామిని గౌరవించిందన్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లను తెచ్చి మల్లన్నసాగర్లో నింపి ప్రజలకు తాగు,సాగునీరు అందించి కరువు లేకుండా తెలంగాణను సుభిక్షంగా పాలించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతోమంది కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడ్డారని,అయినా అవేవి పట్టించుకోకుండా ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ నుంచి 15టీఎంసీలు హైదరాబాద్‌కి తీసుకువెళ్లి ప్రజలకు తాగునీరు అందించాలని చూస్తున్నదన్నారు. కాళేశ్వరమే లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ ప్రజల గొంతు ఎట్ల తడుస్తుండే అని ప్రశ్నించారు.
మంత్రిగా పదేండ్లు కొమురవెల్లి మల్లన్న స్వామికి పట్టువస్ర్తాలు సమర్పించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని హరీశ్‌రావు అన్నారు. అనంతరం కురుమ సంఘం సభ్యులు హరీశ్‌రావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కురుమ సంఘం సీనియర్ నాయకుడు క్యామమల్లేశం, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్ మెట్టుకుమార్, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ ఆదర్శ్‌రెడ్డి, నాయకులు సోమిరెడ్డి, బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లేశం, శ్రీశైలం, అంజయ్య, దేవేందర్‌యాదవ్, కాల్వగడ్డ రాజ్‌కుమార్, దయాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, చెన్నారెడ్డి, కృష్ణకాంత్, విష్ణు, కురుమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.