అమీన్పూర్, డిసెంబర్ 7: యువత సామాజిక సేవల్లో ముందుండాలని పటాన్చెరు, భారతీగర్ కార్పొరేటర్లు మెట్టు కుమార్, సింధూఅదర్శ్రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ మైదానంలో కేసీఆర్ క్రికెట్ టోర్నీని బీఆర్ఎస్ యువ నాయకుడు మాణిక్యం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ, పట్టుదలను పెంపొందించడంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి స్ఫూర్తిదాత అని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. క్రీడలు శారీరిక దారుఢ్యంతోపాటు మానసిక ప్రశాంతను పెంపొందిస్తాయన్నారు.
కేసీఆర్ ఆదర్శభావాలను ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యవంతులను చేయాలన్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కొంతసేపు క్రికెట్ ఆడి జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపారు. కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న మాణిక్యంను ప్రత్యేకంగా అభినందించారు. టోర్నమెంట్ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.