జహీరాబాద్, మే 13: కర్ణాటక ఓటర్లు మార్పు కోరుకున్నారు. ఆ దిశగా నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. దేశంలో మతతత్వ రాజకీయాలు, నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి కన్నడ ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదం చేస్తాయని ప్రజాస్వామిక వాదులు పేర్కొంటున్నారు. అధిపత్యం చెలాయించి అణిచివేయాలని చూసిన కేంద్ర ప్రభుత్వానికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారంటున్నారు.
కర్ణాటకలోని బీదర్, కలబుర్గా జిల్లాలు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు ఆనుకుని ఉంటాయి. ఈ జిల్లాలో తెలుగు ఓటర్లు, ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు పదిశాతం ఉంటారు. వీరు ఈ ఎన్నికల్లో గెలుపోటములు శాసించారు. కాగా, ఈ బీదర్ జిల్లాలో ఎగ్జిట్‌ఫోల్స్ తారుమారయ్యాయి. బీదర్ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటిలో నాలుగు బీజేపీ, రెండుచోట్ల కాంగ్రెస్ గెలిచాయి. ఈ జిల్లాలో జేడీఎస్ బోణీ చేయలేదు. అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించి సత్తాచాటగా, బీదర్ జిల్లాలో మాత్రం బీజేపీ పైచేయి సాధించింది. బీదర్ జిల్లాలోని ఔరాద్, హుమ్నాబాద్, బీదర్, బీదర్(దక్షిణ) స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. బసవకల్యాణ, బాల్కి స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. జేడీఎస్‌కు ఒక్క సీటు దక్కలేదు. ఈ ఫలితాలు ఊహించలేమని రాజకీయ నేతలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కలబుర్గా జిల్లాలోని చించొళి శాసనసభా స్థానంలో బీజేపీ అభ్యర్థి అవినాశ్ ఉమేశ్ జాదవ్‌కు 69,586, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రాథోడ్‌కు 68,772 ఓట్లు, జేడీఎస్ సంజీవ్ యాకత్పూర్కు 6,518 ఓట్లు వచ్చాయి. అవినాశ్ ఉమేశ్ జాదవ్ 814 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.