‘కంటి వెలుగు 2’కి కౌంట్ డౌన్ షురూ అయింది. ఈనెల 18 నుంచి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా, అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో శిబిరాలు ఏర్పాటు చేసి చూపుతో ఇబ్బంది పడుతున్న వారికి పరీక్షలు చేయనున్నారు. అవసరమైన వారికి అద్దాలు, మందులు పంపిణీ చేయడంతో పాటు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. మొదటి విడత విజయవంతమవడంతో రెండో విడతలో మరింత మంది లబ్ధి పొందేలా, పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమావేశాలు నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి జిల్లాలో 17,11,685 మంది, మెదక్ జిల్లాలో 4,72,802మందికి స్క్రీనింగ్ చేస్తారు. పరీక్షల కోసం కావాల్సిన సామగ్రి ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, అక్కడి నుంచి మండల కేంద్రాలు, గ్రామాలకు తరలిస్తున్నారు.
మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 11: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమ నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్నది. మెదక్ జిల్లాలో 4,72,802 మందికి కంటి పరీక్షలు చేయనుండగా, సంగారెడ్డి జిల్లాలో మొత్తం 17,11,685 మందికి స్క్రీనింగ్ చేసేందుకు అధికారులు సూక్ష్మ ప్రణాళికలు రూపొందించారు. మెదక్ జిల్లాలో 40 బృందాలతో 544 శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల్లోని 199 వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు వార్డులలో మొత్తం 854 క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించనున్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్రంలో అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో మరోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో కంటి వెలుగు జిల్లాస్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహించి విజయవంతం చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రజలు ఎక్కువ సంఖ్యలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కంటి వెలుగు శిబిరాలకు సంబంధించిన ప్రాంతాలు, తేదీ, సమయం గురించిన వివరాలను ముందస్తుగా ప్రజలకు తెలిసేవిధంగా చౌకధరల దుకాణాల వద్ద ఫ్లెక్సీల ప్రదర్శనలు, టామ్‌టామ్, మైక్ అనౌన్స్మెంట్ తదితర మార్గాల ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించి కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇప్పటికే ఉన్నతాధికారులు సూచించారు. కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించేందుకు వైద్యాఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి వచ్చే జూన్ 15వ తేదీ వరకు మొత్తం 100 రోజుల పని దినాల్లో ఈ శిబిరాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
మెదక్ జిల్లాలో రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 40 బృందాల ద్వారా 544 శిబిరాలను ఏర్పాటు చేసి 4,72,802 మందికి కంటి పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించడానికి 27 ఏఆర్ మిషన్ (కంటి పరీక్షల యంత్రాలు) అందుబాటులో ఉండగా, మరో 13 రావాల్సి ఉందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 32,596 అద్దాలు అందుబాటులో ఉండగా, వీటిని జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలకు సరఫరా చేశారు.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 17,11,685 మందికి స్క్రీనింగ్ చేసేందుకు అధికారులు ప్రాథమింగా నిర్ణయించారు. ఆ మేరకు సూక్ష్మ ప్రణాళికలు కూడా రూపొందించారు. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలతో పాటు 8 మున్సిపాలిటీలలోని 199 వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు వార్డుల్లో మొత్తం 854 క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. ఏ మండంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్యాంపు నిర్వహించాలి? ఏ ప్రాంతంలో నిర్వహించాలనే విషయాలపై ఇప్పటికే నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీలు, సర్పంచులు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రజల్లో కంటి వెలుగుపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. జిల్లాలో నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ మేరకు ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ కమిషనర్లు కంటి వెలుగు క్యాంపులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 69 మంది అప్తల్మామిక్ అధికారులు, 69 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిన 6 నెలల కోసం నియామకం చేశారు. ఒక్కో బృందంలో ఒక క్యాంపు మెడికల్ ఆఫీసర్, ఒక పారామెడికల్ అప్తాల్మిక్ ఆఫీసర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశలు, వెన్యూ సూపర్వైజర్ ఉంటారు.
జిల్లాల్లోని ఆయా గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో నిర్వహించనున్న కంటి వెలుగు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో బృందానికి రోజుకు ఒక వెయ్యి రూపాయలను మౌలిక సదుపాయాల కోసం అందజేయనుండగా, సంబంధిత నిధులతో టేబుల్స్, కుర్చీలు, షామియానా, తాగునీటి వంటి సౌకర్యాలకు ఖర్చు చేయనున్నారు. గ్రామ పంచాయతీల్లో కార్యదర్శితో పాటు ఏఎన్ఎం, ఆశ, ఏడబ్ల్యూటీ, వీవోఏలు, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్‌తో పాటు ఏఎన్ఎం, ఆశ, ఏడబ్ల్యూటీ, ఎస్ఎల్ఎఫ్ సభ్యులు, ఆర్పీలు ప్రజలను కంటి వెలుగుపై చైతన్యం చేస్తూ ఏ సమయానికి, ఏ ప్రాంతంలో హాజరు కావాలనే విషయాలపై అవగాహన కల్పిస్తారు.
ఈ నెల 18 నుంచి కంటి వెలుగు శిబిరాలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని డివిజన్లు, మండలాలకు కంటి చికిత్సకు సంబంధించిన సామగ్రిని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. ఆయా మండలాలకు కంటి అద్దాలు, చుక్కల మందులు, ఇతర మందులతో పాటు కంటి పరీక్ష చేసే పరికరాలను సరఫరా చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 18 ఏండ్ల పైబడిన వారందరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ శిబిరాల నిర్వహణకు సంబంధించి గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్ స్థాయి సూక్ష్మ ప్రణాళికలను అధికారులు, ప్రజాప్రతినిధులకు అందజేశాం. ఆయా తేదీల్లో ఆయా వార్డులు, గ్రామాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలి.
– శరత్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్