సంగారెడ్డి, అక్టోబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు పాత జిల్లాల వారీగా బీసీ కుల గణననకు బీసీ కమిషన్ బృందం అభిప్రాయ సేకరణ చేపడుతున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బీసీ కుల గణన అభిప్రాయ సేకరణను బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ అభిప్రాయ సేకరణలో మూడు జిల్లాలకు చెందిన 96 మంది బీసీ సంఘాల నాయకులు పలు అంశాలపై కమిషన్‌కు పిటిషన్లు ఇచ్చారు. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ఆయా కుల సంఘాల నాయకులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కుల గణనను సమగ్రంగా చేపట్టి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. గతంలో ప్రకటించిన విధంగా బీసీ కులాలకు చట్టసభల్లో 42శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వాలు స్పందించక పోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బీసీ కులాలకు న్యాయం జరిగేలా కమిషన్ పనిచేస్తుందని చెప్పారు. చట్టసభల్లో వెనకబాటుకు గురవుతున్న బీసీలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి సర్వేకు ఆదేశాలిచ్చిందన్నారు. ఈ సర్వే నవంబర్ 6 నుంచి ప్రారంభమవుతుందని, బీసీ కుల సంఘాల నాయకులు, సభ్యులు బీసీ కుల గణననకు పూర్తి వివరాలు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలు అందజేయడంతో బీసీల సంఖ్య ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. గతంలో బీసీ కుల గణననకు ఎన్నో కమిషన్లు వేసినా ఫలితాలు శూన్యమని, ప్రస్తుతం జరిగే కుల గణన పారదర్శకంగా నిర్వహించి బీసీ కులాలకు న్యాయం చేసేలా చూస్తామన్నారు. ఏబీసీడీ వర్గీకరణతో కాకుండా కులా ల వారీగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే న్యాయం జరగుతుందని, కొన్ని బీసీ సంఘాల నాయకులు పిటిషన్లు ఇచ్చారన్నారు.
గ్రామాల్లో నవంబర్ 9 నుంచి జరిగే బీసీ కుల గణనను కలెక్టర్, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఎన్యూమరేటర్లకు అవగాహన కల్పించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు సర్వే పారదర్శకంగా చేపట్టేలా అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు చేసే తప్పిదంతో భవిష్యత్తులో కులం పేరు మారిపోయే పరిస్థితి రాకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కమిషన్ సేకరించిన బీసీ సంఘాల అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ముఖ్యంగా జిల్లాస్థాయి సమావేశాలకు కలెక్టర్లు హాజరై కుల సంఘాల అభిప్రాయాలను తెలుసుకుంటే సర్వేకు పూర్తి అవగాహన వస్తుందని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు అట్రాసిటీ చట్టం అండగా ఉందని, బీసీ కులాలకు అలాంటి రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కుల సంఘాల నాయకులు కమిషన్‌కు ఇచ్చిన పిటిషన్లో పేర్కొన్నారని చైర్మన్ గుర్తుచేశారు. ముఖ్యంగా దొమ్మరికులం, తమ్మలికులం ఆయా కులాలు చేసే కుల వృత్తులను బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఉండడం శోచనీయమన్నారు. లోదికులం బీసీలో ఉన్నా కుల ధ్రు వీకరణ పత్రాలు ఇవ్వకపోవడం, ఆరె కటికెలను ఎస్సీలుగా మార్చాలని ఆయా సంఘాల నాయకులు కమిషన్ దృష్టికి తెచ్చారన్నారు.
ఉమ్మడి జిల్లాకేంద్రాల్లో నిర్వహిస్తున్న బీసీ కుల సం ఘాల అభిప్రాయ సేకరణలో ఆయా జిల్లాల కలెక్టర్లు హాజరుకాకపోవడం శోచనీయమని కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు కమిషన్ అభిప్రాయ సేకరణకు హాజరుకాలేదని సీఎంకు ఫిర్యా దు చేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పదాలు జరగకుండా కమిషన్లను ప్రభుత్వం నియమించిందని, కలెక్టర్లు కమిషన్ బృందానికి స్వాగతం పలికి సంఘాల వివరాలు సేకరించడానికి దోహదపడాలని సూచించారు.
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని బీసీ సంఘాల ప్రతినిధుల కమిషన్‌కు అభిప్రయాలు తెలియజేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి సూచించారు. నవంబర్ 6 నుంచి చేపట్టనున్న సమగ్ర బీసీ కుల గణనకు ప్రతిఒక్కరూ పాల్గొని అభిప్రాయాలను చెప్పాలన్నారు. సమావేశంలో బీసీ కమిషన్ బృందం సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, కమిషన్ ప్రత్యేకాధికారి కోచైర్మన్ సతీశ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్, సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీటీసీడీవోలు గజదీశ్, నాగభూషణం, షేక్‌అహ్మద్, బీసీ సంఘాల నాయకులు, కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, అక్టోబర్ 30: బీసీ కమిషన్ అంటే ఇంత చులకనా, జిల్లాకు వస్తే కలెక్టర్ స్వాగతం తెలపకపోవడం విడ్డూరంగా ఉందని కలెక్టర్ వల్లూరు క్రాంతిపై రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ అటోడిరియంలో బీసీ కుల గణనపై బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధుల నుం చి అభిప్రాయ సేకరణకు వచ్చిన బీసీ కమిషన్ బృందానికి స్వాగతం పలకకపోవడంతో కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వెనకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ చేపట్టేందుకు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చిన కమిషన్ చైర్మన్, సభ్యులకు ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ స్వాగతం పలకాలి. కానీ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్వో పద్మజారాణి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి కమిషన్‌కు స్వాగతం పలకడంతో కమిషన్ బృందానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ రావాలి కదా..! ఎందుకు రాలేదంటూ చైర్మన్ నిరంజన్ అధికారులను ప్రశ్నించారు. బీసీ కమిషన్ అంటే కలెక్టర్‌కు అంత చులకనా, కమిషన్ అంటే తమాషాగా ఉందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు.