రామచంద్రాపురం, మే 2: తెలంగాణకు సంబంధించి 60 ఏండ్ల విశేషాలను వివరిస్తూ ‘సంబురం’ జర్నీ ఆఫ్ ట్రూ లీడర్ పుస్తకాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆవిష్కరించారు. ‘సంబురం’ పుస్తకాన్ని రచించిన టీజీ 24×7 బృందం, పుస్తక ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ఆర్కే ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ యువ నాయకుడు కాల్వగడ్డ రాజ్‌కుమార్ శుక్రవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో ఆయనను వారు ప్రత్యేకంగా కలిశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా ‘సంబురం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన సంబురం పుస్తకాన్ని పరిశీలించి చదివారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 2001 పార్టీ స్థాపించిన నాటి నుంచి 25ఏండ్ల బీఆర్ఎస్ ప్రస్థానం వరకు స్వరాష్ట్రం కోసం కేసీఆర్ పోరాటం, అధికారంలో బీఆర్ఎస్ చేసిన విజయాలతో పాటు ఇటీవల జరిగిన రజతోత్సవం సభ అంశాలను ప్రతీది నిక్షిప్తం చేస్తూ పుస్తకం రూపంలో రచించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. ‘సంబురం’ జర్సీ ఆఫ్ ట్రూ లీడర్ అనే క్యాప్షన్ చాలా బాగుందన్నారు.
ఒక నిబద్ధ్దత, నిజాయితీ, పట్టుదల, ధైర్యం, కార్యసాధకుడు ఇవన్నీ కలగలిపితే కేసీఆర్ అని, ఆయన కృషిని గుర్తించి ‘జర్నీ ఆఫ్ ట్రూ లీడర్’ క్యాప్షన్ పెట్టడం పుస్తకానికే వన్నె తెచ్చిందన్నారు. పుస్తక రచయితలైన సీనియర్ పాత్రికేయులు కోటిరెడ్డి, బాలకృష్ణ, మాలతి, తేజలతో పాటు పుస్తకం ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన కాల్వగడ్డ రాజ్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సంబురం పుస్తకం చూస్తుంటే, చదువుతుంటే బీఆర్ఎస్ విజయాలు, పోరాటాలు, కేసీఆర్ సాధించిన విజయాలు కండ్లకు కట్టినట్లు కనిపిస్తుందని హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ని హరీశ్‌రావు అభినందించారు.