సిద్దిపేట కమాన్, డిసెంబర్ 27: జర్నలిస్టుల హకులు కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని టీయూడబ్ల్యూజే(హెచ్ 143) జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మానుకోవాలని శనివారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(హెచ్143) జిల్లా బాధ్యులు గందె నాగరాజు, నాయకులు నిమ్మ అశోక్, గజ్వేల్ ఇన్చార్జి నవీన్, హుస్నాబాద్ నాయకుడు కళాచందర్ మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 23 వేల అక్రెడిటేషన్లు ఇచ్చారని, కొత్త జీవో వల్ల 10వేలకు పైగా కోత పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయి లో రిపోర్టర్లకు కార్డు ఉండేదని, ఇప్పుడు రద్దు చేసి, స్టేట్, జిల్లా, మండల స్థాయిలో మాత్రమే కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం దారుణమన్నారు. గతంలో జనరల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని, ఇప్పుడు ఆకోటా రద్దుచేసి ఫ్రీలాన్స్ కోటాలో కార్టూనిస్టులకే పరిమితం చేశారన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్‌కు డిగ్రీ విద్యార్హత లేదా ఐదేండ్ల అనుభవం ఉండాలని, జిల్లా, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్ విద్యార్హత చేశారన్నారు. ఇది వరకు పట్టణ ప్రాంతాలు, మండలాల్లో 50 వేల జనాభాకు ఒక అక్రెడిటేషన్ చొప్పున ఇచ్చారని, కానీ ఇప్పుడు మండలానికి ఒక కార్డు మాత్రమే ఇస్తామని ఆ జీవోలో పేరొనడం సరికాదన్నారు. కేబుల్ చానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులు రద్దు చేశారన్నారు. కార్యక్రమంలో కట్ట నవీన్, సంపత్, పోతుల మల్లేశ్, కరుణాకర్, శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు.