ఝరాసంగం, మార్చి 12 : ఇంటింటా సేకరించిన చెత్త నుంచి సేంద్రీయ ఎరువును తయారు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కంపోస్టు షెడ్లను నిర్మించింది. సేకరించిన చెత్తతో పొడి చెత్తలోని ప్లాస్టిక్, ఇనుము తదితర వస్తువులను వేరుచేయాలి. తడి చెత్తలో సేంద్రియ ఎరువును తయారు చేసి రైతులకు విక్రయించి గ్రామ పంచాయతీలకు ఆదాయం పెంచాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో పాటు గ్రామాల్లో పారిశుధ్యాన్ని, స్వచ్ఛతను మరింత మెరుగుపర్చాలని గత ప్రభుత్వం భావించి ప్రజలకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేసింది.
పంచాయతీ సిబ్బందికి ట్రాక్టరు సైతం అందుబాటులోకి తీసుకొచింది. మండల కేంద్రంతో పాటు కప్పానగర్ గ్రామాల్లో నిత్యం ట్రాక్టర్ల ద్వారా సేకరించిన తడి, పొడి చెత్తను ఊరు బయట రోడ్డు పక్కల, అడవిలో డంప్ చేయడంతో పాటు దానికి నిప్పు అంటిస్తున్నారు. అంటుకున్న నిప్పుతో రోజుల తరబడి మంటలు, పొగలు వ్యాపిస్తున్నాయి. అడవిలో డంప్ చేస్తున్న చెత్త గాలికి కొట్టుకుపోయి సమీప పొలాల్లోకి చేరడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయని రైతులు చెబుతున్నారు. చెత్తలో ఉన్న ప్లాస్టిక్ కవర్లను మూగజీవులు తింటున్నాయి. ఒక్కో ప్రత్యేక అధికారికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్థంగా మారిపోయిందనీ గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్రామ శివారులో, అడవిలో డంపు చేస్తున్న చెత్తను డంపింగ్ యార్డ్ లో వేసేలా చర్యలు తీసుకుని సేంద్రియ ఎరువు తయారు చేసేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.