గుమ్మడిదల, ఫిబ్రవరి 24: ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకునే వరకు పోరాటాం ఆపమని జేఏసీ నాయకులు తేల్చిచెప్పారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు పనులు ఆపాలంటూ గుమ్మడిదలలో రైతు, మహిళా జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు కలిసి సోమవారం జాతీయరహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేఏసీ నాయకులు తహసీల్ కార్యాలయానికి వెళ్లి నాయబ్ తహసీల్దార్ కరుణాకర్‌రావుకు, ఆర్ఐ శ్రీనివాస్‌రెడ్డికి, మున్సిపల్ కమిషనర్ రఘుకు గులాబీపూలు అందజేసి డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలని విన్నవించారు. 20 రోజులుగా ఆందోళనలు చేస్తున్న అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోక పోవడంపై ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహసీల్ అధికారులు తెలిపారు. అనంతరం ర్యాలీగా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. గుమ్మిడిదలలో 20వ రోజు పద్మశాలి సంఘం సభ్యులు దీక్ష చేపట్టారు. వారికి జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, అఖిలపక్ష నాయకులు పుట్ట నర్సింగ్‌రావు, రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.
నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో 20వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ముదిరాజ్ సంఘం సభ్యులు దీక్షలో కూర్చున్నారు. నల్లవల్లి, కొత్తపల్లి, గుమ్మడిదల గ్రా మాల యువకుల కొరివి శంకర్, తలారి వెంకటేశ్, రాజబోయిన సత్యనారాయణ, తలారి శోభన్, గాండ్ల బద్రి, గాండ్ల శ్రీశైలం, బొడ్డు మహేశ్, కుమ్మరి ఆంజనేయులు, ఫయాజ్షరీఫ్, మన్నె రామకృష్ణ, రాజు గౌడ్, కొరివి సురేశ్, మల్లేశ్‌గౌడ్, ఆంజనేయులు యాదవ్, సూర్యనారాయణ, ఉదయ్‌కుమార్,శ్రవణ్, సంజీవరెడ్డి, ఆకుల సత్యనారాయణ, తూపాలకుల రాజు, లక్ష్మణ్ తదితరులు దీక్షల్లో పాల్గొన్నారు.
డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కారులు ఎలాంటి గొడవలు చేసినా తక్షణమే వారిని చెదరగొట్టడానికి భాష్పవాయువు ప్రయోగించడానికి దీక్ష శిబిరం వద్ద 207 వజ్రాగ్యాస్ వాహనాన్ని పోలీసులు సిద్ధంగా ఉంచారు. దీంతో జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తాము డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలని శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాపై కాలుదువ్వడానికి యత్నించడం తగదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు చేయడానికి హక్కులేదా లేదా అని ప్రశ్నించారు.