గుమ్మడిదల, మార్చి 7: డంపింగ్ యార్డు రద్దు చేయకుంటే స్థానిక ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డును రద్దు చేయాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 31వ రోజుకు చేరుకున్నారు. నల్లవల్లి గ్రామంలో గౌడ సంఘం సభ్యులు దీక్ష చేపట్టారు. దీక్షలు కొనసాగడానికి గౌడ సంఘం సభ్యులు రూ.10 వేల విరాళాన్ని రైతు జేఏసీ నాయకులకు అందజేశారు.
కొత్తపల్లిలో గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో మత్స్యకార కులస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి రైతు జేఏసీ నాయకులు మద్దుతిచ్చారు. మత్స్యకార సంఘం సభ్యులు దీక్షలు కొనసాగడానికి రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. 31 రోజుల నుంచి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, జిల్లా మంత్రి, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం అన్యాయమన్నారు.
ప్యారానగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో సర్కారు భూమి కేవలం 37 ఎకరాలు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. ప్యారానగర్లో 1-63 సర్వే నంబర్ భూమిలో 722-38 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో రైతులకు పట్టాలు ఇచ్చింది 436.08 ఎకరాలన్నారు. వివాదాస్పదంగా ఉన్న భూమి 286.23 ఎకరాలు ఉండగా ఆ భూములు ఇప్పటికే రైతుల కబ్జాలో ఉన్నాయన్నారు. మిగిలిన సర్కారు భూమి 37 ఎకరాలు మాత్రమే. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి 152 ఎకరాలు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి 152 ఎకరాలు ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.
డంపింగ్ యార్డు కోసం రికార్డులు తారుమారు చేశారన్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, అభిశెట్టి రాజశేఖర్, మాజీ ఉపసర్పంచ్ మొగులయ్య, జేఏసీ నాయకులు పుట్ట నర్సింగ్‌రావు, మూడుచింతల నరేందర్‌రెడ్డి, నాగేందర్ గౌడ్, కాలకంటి రవీందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, మంద భాస్కర్‌రెడ్డి, మంద బలరాంరెడ్డి, కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రారెడ్డి, ముద్దంగుల గోపాల్, ఆకుల సత్యనారాయణ, సూర్యనారాయణ, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, కరుణాకర్, ఉదయ్ కుమార్, మన్నె రామకృష్ణ, మధు, రాము, మేకల యాదగిరి, బొర్ర శ్రీనివాస్‌రెడ్డి, రాం రెడ్డి, సత్తయ్య, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
నర్సాపూర్, మార్చి 7: డంపింగ్ యార్డును ప్రభుత్వం రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ నర్సాపూర్ పట్టణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి గాలి, నీరు, వాతావరణాన్ని కలుషితం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. డంపింగ్ యార్డును రద్దు చేసే వరకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డు నిర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజు యాదవ్, రమణారావు, సంఘసాని సురేశ్, నర్సింగరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.