హుస్నాబాద్, అక్టోబర్ 13: కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో దసరా సందర్భంగా శమీ పూజ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరిగేలా ప్రభుత్వం జీవో 18 తెచ్చిందని, 60 రోజుల్లో సంపూర్ణంగా సర్వే నిర్వహించి కులగణన పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. బీసీ కమిషన్ సూచన మేరకు కులగణన చేపడుతున్నామని, ఈ ప్రక్రియ షురూ కావడం బీసీ మంత్రిగా హర్షం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. గడిచిన పది నెలల్లో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కోహెడ మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు భూమిపూజ, హుస్నాబాద్ పట్టణానికి రూ.28కోట్లు మంజూరు, రూ.37కోట్లతో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ పనులు, రూ.4.70కోట్లతో సర్వాయి పాపన్న కోట అభివృద్ధి, అక్కన్నపేటలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, రూ.1.75కోట్లతో ఎల్కతుర్తి కూడలి అభివృద్ధి, రూ.70కోట్లతో పీఆర్ రోడ్లు తదితర పనులు చేపట్టామన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఇందుకోసం ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేస్తున్నదని తెలిపారు. మొదట నిరుపేదలకే ఇండ్లు వస్తాయని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం గౌరవెల్లి రిజర్వాయర్ కాల్వ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి వచ్చే వర్షాకాలం వరకు పంటలకు సాగునీరందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. గిరిజన తండాలకు పెద్ద ఎత్తున నిధులు తేనున్నట్లు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో ఎప్పటికప్పుడ సమీక్షలు నిర్వహించి పనుల్లో పురోగతి ఉండేలా చూస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు లేకుండా ఉద్యోగులను నియమిస్తున్నామని, త్వరలోనే మెడికల్ క్యాంపులు, ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు మంజులారెడ్డి, జంగపల్లి అయిలయ్య, చిత్తారి రవీందర్, బంక చందు, అక్కు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.