మెదక్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత యాసంగి సీజన్లో మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్ అయిన ఘనపూర్ ప్రాజెక్ట్ ఆనకట్ట కింద ఉన్న 21,625 ఎకరాలకు జనవరి 13 నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు విడతల వారీగా సాగునీటిని అందించనున్నామని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ చెప్పారు. గురువారం ఇఫో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో కలిసి ఇంజినీరింగ్ అధికారులు, బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 18న మాఘ అమావాస్య సందర్భం గా ఏడుపాయలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని సిం గూరు నుంచి ఘనపూర్ ప్రాజెక్ట్‌కు జనవరి 13న నీటిని విడుదల చేయాలని సమావేశం తీర్మానించిందన్నారు. కాగా 8 నుంచి 10విడతల్లో సాగునీటిని అందించాలని తీర్మానించింది. అదే విధంగా జిల్లాలో 10ట్యాంకుల కింద 500 ఎకరాలపైన ఆయకట్టు కలిగిన 6,300ఎకరాలకు చెరువుల ద్వారా సాగు నీటిని అందించనున్నామన్నారు. ఇంకా ఎకడైనా నీటి పారుదల కాలువలు నిర్మించాల్సి ఉన్నా, లైనింగ్ లేదా గైడ్ వాల్ నిర్మించాల్సిన పను లు గుర్తించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టుటకు ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
గ్రామాల్లో రైతులు ఇష్టం వచ్చినట్లు తూముల ద్వారా నీటిని అక్రమంగా వినియోగించకుండా తూముల ద్వారా నీటిని వదులుటకు అవసరమైన మనుషులను ఆ గ్రామంలోనే ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. నీటి విడుదలపై రైతులు సమాచారం తెలుసుకోవడం కోసం వీలుగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ యాసంగి సీజన్లో రైతులకు సక్రమంగా సాగునీరందించడంలో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరి చేయాలన్నారు. జిల్లాలో హల్దీ వాగు, మంజీరా, చెరువులు, ట్యాంకులు నిండుకుండలా ఉన్నాయని సాగునీటికి ఇబ్బంది లేదన్నారు.
అనంతరం ఇఫో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకుని, నింపుకొన్నామని తద్వారా భూగర్భ జలమట్టం కూడా పెరిగి, విద్యుత్ వినియోగం కూడా తగ్గిందన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ యేసయ్య, ఈఈ శ్రీనివాస్‌రావు, ఆర్డీవో సాయిరాం, ఉద్యానశాఖాధికారి నర్సయ్య, సీపీవో మహమ్మద్ ఖాసీం, బోర్డు సభ్యులు సుభాష్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, డిప్యూటీ ఇంజినీర్లు, సహాయ ఇంజినీరింగ్ అధికారులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.