పుల్కల్, ఆగస్టు 4: రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడంలేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు.సంగారెడ్డి జిల్లా పుల్కల్లో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంగళవారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండున్నరేండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పుల్కల్ ప్రజల కోసం యాభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి నిర్మించిందన్నారు.
అప్పట్లో 48 మంది లబ్ధిదారుల ఎంపిక కోసం రూమ్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. పంపిణీ చేసేలోపు అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ఇండ్ల పంపిణీ చేయలేదన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వారికి కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ వారికే ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక మంత్రి నిర్లక్ష్యంతోనే ప్రజలకు ఇండ్లు పంపిణీ చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కొందరు లబ్ధిదారులు ఇండ్లులేక అప్పట్లో వారికి కేటాయించిన బ్లాక్‌లో ఉన్న నంబర్ రూమ్‌లో నివాసం ఉంటుంటే ఓర్వలేక అధికారులతో బెదిరించి తాళాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ప్రస్తుతం ముళ్లపొదలు దర్శనమిస్తున్నాయని, అక్కడ విద్యుత్, తాగునీరు, రోడ్లు, పగిలిపోయిన కిటికీ అద్దాలు బాగుచేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో నివాసం ఉంటున్న వారిని ఇబ్బంది పెట్టకుండా స్థానిక మంత్రి అధికారులకు సూచించాలన్నారు. ఇటీవల హౌసింగ్ అధికారులు వచ్చి ఇండ్లు ఖాళీ చేయాలని అనడం మంచి పద్ధతి కాదన్నారు. బీఆర్ఎస్ అందోల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి, సర్పంచ్ లావణ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోచయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌చారి,వివిధ గ్రామాల సర్పంచ్‌లు మల్లేశం, లక్ష్మీరాజు, సింగూ ర్ మాజీ సర్పంచ్ రాజు, ఇందూరి మోహన్, శుభాష్‌రెడ్డి బాబు, లక్ష్మణ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.