పటాన్చెరు రూరల్, అక్టోబర్ 5 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పారిశ్రామిక కాలుష్యం ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. చాలా పరిశ్రమలు నిబంధనలు పాటించక పోవడంతో పర్యావరణ కలుషితం జరుగుతున్నది. ఈ ప్రాంతంలో 250 వరకు ఫార్మా, కెమికల్, బల్క్‌డ్రగ్ పరిశ్రమలు ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. పటాన్చెరు మండలంలోనే 150 వరకు రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు వేలాది లీటర్ల కాలుష్య వ్యర్ధ జలాలు ఉత్పత్తి అవుతాయి.
ఈ పరిశ్రమలు పటాన్‌చెరులోని సామూహిక కాలుష్య శుద్ధి కర్మాగారం(పీఈటీఎల్)లో సభ్యత్వం పొంది ఉన్నాయి. తమ పరిశ్రమల్లో ఉత్పన్నమైన కాలుష్య జలాలను పీఈటీఎల్‌కు పంపిస్తారు. అక్కడ 5వేల టీడీఎస్లోపు గాఢత ఉన్న వ్యర్థ జలాలనే ఆ సంస్థ శుద్ధి చేసేందుకు తీసుకుంటుంది. కొన్ని పరిశ్రమల్లో 10వేలు, ఆపైన టీడీఎస్ ఉన్న వ్యర్థ జలాలు వెలువడుతాయి. వాటిని రాత్రి సమయంలో, లేదంటే నిర్మానుష్య ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా పారపోస్తారు.
ఈ ట్యాంకర్లకు రక్షణగా అసాంఘిక శక్తులు అడ్డుగా ఉంటాయి. ట్యాంకర్ల ముందు, వెనుక వాహనాల్లో వీరు వెంబడిస్తారు. గతంలో ఇలాంటి ట్యాంకర్‌ను ఖాజీపల్లి ప్రాంతంలో పీసీబీ టాస్క్‌ఫోర్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తే , ఈ ముఠాలు అధికారులపైనే దాడి చేసి అక్కడి నుంచి తరిమారు. ఇప్పుడు ట్యాంకర్లు, పరిశ్రమల ఔట్లెట్లు వ్యర్థ్ధాలను యథేచ్ఛగా వదులుతున్నాయి. అందుకే సమీపంలోని జలవనరుల్లో కాలుష్య జలాలు చేరి రంగుమారుతున్నాయి. దుర్వాసనతో చెరువులు కంపుకొడుతున్నాయి.
చెరువుల్లో చేపలు బతికే పరిస్థితి లేదు. చెరువు నీటిలో హై టీడీఎస్‌తో లవణాలు, ఖనిజాలు, రసాయనాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. జలవనరుల్లో డిసాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటున్నది. క్లోరైడ్స్, హెవీ మెటల్స్, సల్ఫెట్స్, ఆర్గానిక్ సమ్మేళనాలు, క్రోమియం, లెడ్ వంటి ప్రమాదకర రసాయనాలు బయటపడుతున్నాయి.
జలవనరుల్లో బయో ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగింది. పెస్టిసైడ్స్‌తో పాటు యాంటీ బయోటిక్స్, యాసిడ్స్ ఇక్కడి నీటిలో పరిశోధకులు కనుక్కున్నారు. వీటి కారణంగా జలవనరుల్లో దిగిన ప్రజలకు, పశువులకు చర్మరోగాలు వస్తున్నాయి. ఈ నీరు భూగర్భ జలాల్లోకి చేరి ఇండ్లలో వాడుకోవడం ప్రమాదకరంగా మారుతున్నది. కాలుష్య జలాలను తాగిన వందలాది పశువులు మృతి చెందాయి. ప్రతి ఏడాది భారీగా చేపలు మృతిచెంది మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగుతున్నది.
Medak3
మొద్దునిద్రలో టాస్క్‌ఫోర్స్‌లు
రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలను కోర్టు ఆదేశాల మేరకు అడ్డుకునే బాధ్యత పీసీబీ అధికారులపై ఉంది. పీసీబీ అధికారులు కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై తనిఖీలకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ఫోర్స్ పనిచేస్తున్నది. వర్షాలు పడినప్పుడు వీరు తనిఖీలు నిర్వహిస్తారు. ఫిర్యాదులు వచ్చిన తక్షణం వీరు ఆ పరిశ్రమల ఔట్లెట్లను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదులు వచ్చిన తర్వాత టాస్క్‌ఫోర్స్ వెళ్లేలోపే పరిశ్రమల వద్ద పరిస్థితులు మారుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
పరిశ్రమలు తమ వద్ద నిల్వ ఉన్న వ్యర్ధజలాలను వానలు పడగానే వదిలేసినట్టు జలవనరులను పరిశీలిస్తే అర్థం అవుతున్నది. అవి కాలుష్య జలాలని తెలిసినా అధికారులు సంబంధిత పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదు. కొంతకాలంగా ఇస్నాపూర్ పెద్ద చెరువు కాలుష్యానికి కేంద్రంగా మారింది. పాశమైలారం రసాయన పరిశ్రమలు బహిరంగంగా కాలుష్య జలాలను వదులుతున్నా పట్టించుకోవడం లేదు. పరిశ్రమలపై పెద్దగా చర్యలు ఉండటం లేదు.
ఇస్నాపూర్ పెద్ద చెరువు అలుగుపారి రుద్రారం వద్ద జాతీయ రహదారిపైకి చేరాయి. కాలుష్య జలాలతో జాతీయ రహదారిపై దుర్వాసన వెదజల్లుతున్నా జిల్లా అధికారులు కనీస విచారణ చేపట్టడం లేదు. మరోవైపు నక్కవాగులోకి జిన్నారం, అమీన్పూర్, రామచంద్రాపురం మండలాల కాలుష్య జలాలు ప్రవహిస్తున్నాయి. ఈ కాలుష్య జలాలు నేరుగా మంజీరా నదిలో కలుస్తున్నాయి. ఈ నీటినే తాగు, సాగునీటికి వాడుతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అన్ని పరిశ్రమల్లో ఈటీపీలు ఏర్పాటు చేసుకునేలా పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జీరో డిస్చార్జ్ కోర్టు ఆదేశాలను అమలు చేయడం తమ బాధ్యతగా పరిశ్రమల యజమాన్యాలు గుర్తించాలి. లేదంటే భావితరాలకు గడ్డుకాలం తప్పదు. ప్రజారోగ్యానికి పెనుముప్పు తప్పదు. గత రెండు దశాబ్దాల్లో జిల్లా యంత్రాంగం కాలుష్యం వెదజల్లడంపై , దాని దుష్పరిమాణంపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌లో సమీపంలో ఉంటున్న ప్రజల ఆరోగ్యాలపైన ఎలాంటి పరిశోధనలు నిర్వహించలేదు. పరిశ్రమలు రూ.వేలకోట్ల ఉత్పత్తులు తీసి జిల్లా పురోగతిలో భాగమవుతున్నాయని చెబుతున్న అధికారులు, అవే పరిశ్రమల ద్వారా ఉత్పన్నం అవుతున్న సమస్యలను పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.