జహీరాబాద్, జూలై 14 : నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం 3,405 ఇండ్లు మంజూరు చేసింది. తొలుత ఫైలట్ ప్రాజెక్టు కింద జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని మోడల్ గ్రామాల్లో అర్హులకు ఇండ్లు మంజూరు చేశారు. మొదటి విడతలో జహీరాబాద్ మండలానికి 583, మున్సిపల్‌కు 313, న్యాల్కల్కు 688, మొగుడంపల్లికి 508, కోహీ ర్కు 549, ఝరాసంగం మండలానికి 573 ఇండ్లు మంజూర య్యా యి.
ఆయా మండలాల్లో 1516 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభిం చేందుకు ముగ్గులు పోశారు. అందులో బేస్మెంట్ లెవల్లో 324, లెంటల్ లెవల్లో 52, స్లాబ్ లెవల్లో 17 ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వాటిలో ఇప్పటి వరకు బేస్మెంట్ లెవల్ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నవి 200, రూప్లెవల్లో 25 ఇండ్లకు బిల్లులు చెల్లించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంలో ఇబ్బందులు తప్పడం లేదు.
అది కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు 400 నుంచి 600 చదరపు అడుగులలోపే ఇల్లు నిర్మించుకోవాలి. దీనికి తోడు ఇసుక, సిమెంట్, ఇటుక, ఎర్రరాయి ధరలు పెరిగాయి. దీంతో ప్రభుత్వం నిర్దేశిత వ్యయంతో ఇంటి నిర్మాణం పూర్తికావడం కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి నిర్మాణానికి కావా ల్సిన సిమెంట్, ఇటుక, ఎర్రరాయి ధరలు భారీగా పెరగడంతో లబ్ధిదారులకు భారంగా మారింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ. 5 లక్షలు చెల్లిస్తున్నప్పటికీ అంతకు రెట్టింపు స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో ఇండ్లు మంజూరైనా చాలా మంది నిరుపేద లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
వీరంతా రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఇంటి నిర్మాణం చేపట్టే స్థోమత లేక నిర్మాణ పనులు ప్రారంభిం చేందుకు ముందుకు రావడం లేదు. మరి కొంత మంది లబ్ధిదారులు తక్కువ విస్తీర్ణంలో నచ్చక ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తి చూప డం లేదు. పునాదుల దశలో ఇచ్చే రూ. లక్షకు అదనంగా ఖర్చు కావడంతో చాలా మంది లబ్ధిదారులు వెనుకడుగు వేస్తున్నారు. జహీరాబాద్ నియో జకవర్గంలోని ఆయా మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.