హుస్నాబాద్‌టౌన్, జనవరి 17: “ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలనేది మేం ఎట్ల జెప్తం… అందరినీ చూసుకుంటూ వాళ్లకు ఇండ్లు ఇవ్వరాదు.. వీళ్లకు ఇయ్యాలే అని ఎట్లజెప్పాలి… గట్ల జెప్పి మళ్లీ ఓట్లకు ఎట్లపోతం… మమ్ముల్ని వాళ్లు తిట్టుకోరా… ఊకుంటరా”… ఇది ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికారులకు వేసిన ప్రశ్నలు… సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిలర్లు, వార్డు అధికారులు, ఇందిరమ్మ వార్డుకమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, కమిషనర్ టి.మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ ఈనెల 21వతేదీ నుంచి రోజూ ఐదువార్డుల చొప్పున సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఇందులో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనే విషయాన్ని కమిటీ సభ్యులు తెలుపాలని కమిషనర్ టి.మల్లికార్జున్‌గౌడ్ సూచించారు. దీనిపై పలువురు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితా మాకు ఎందుకు ఇయ్యలేదు… అవి ఇస్తే ఎవరికి ఇయ్యాలో అనేది చూసి ట్రిక్ పెడతం అని వారు కమిషనర్‌కు వివరించారు. ప్రభుత్వం నుంచి మాకు ఇంకా జాబితా రాలేదని చెప్పగా ఇంకెప్పుడు ఇత్తరు గట్లాంటప్పుడు మమ్ముల్ని ఎందుకు పెట్టిండ్రు అని వారు నిలదీశారు. సమావేశాలు నిర్వహించే ప్రదేశంలో బాక్స్ పెట్టాలని అందులో చిట్టీలు రాసి వేస్తామని కమిటీ సభ్యులు సూచించగా ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాలు వస్తే చెప్తామని కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్ స్పష్టం చేశారు.
మాకు తెల్వకుండా సభ్యులుగా పెట్టి జనంలో మమ్ముల్ని బద్నాం చేసుడు తప్ప ఒరిగేది ఏమీలేదంటూ పలువురు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చైర్పర్సన్, కమిషనర్ కమిటీ సభ్యులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నాలు చేసినా సభ్యులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో సమావేశాలు నిర్వహించాలని, అర్హులైన వారిని ఎంపిక చేయాలని చైర్పర్సన్ కోరారు. సమావేశంలో వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, కౌన్సిలర్లు కొంకట నళినిదేవి, బోజు రమాదేవి, పెరుక భాగ్యారెడ్డి, జనగామ రత్నమాల, గోవిందు రవీందర్, బొల్లి కల్పన, కోమటి స్వర్ణలత, మ్యాదరబోయిన వేణు, బొజ్జ హరీశ్, వల్లపు రాజు, చిత్తారి పద్మ, భూక్యా సరోజనతో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.