సిద్దిపేట, జనవరి 20: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. సోమవారం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఉపాధి హామీ పథకం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో నిర్వాసితులు సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు నాలుగేండ్లుగా ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం వల్ల ప్రభుత్వం కూలీలకు అమలుచేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులు కాకుండా పోయారన్నారు.
ఇటీవల మున్సిపాలిటీల్లో కలిపిన గ్రామాలకు ప్రత్యేక పరిస్థితులు అమలు చేస్తున్నట్లయితే మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ తదితర ప్రాజెక్డుల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వమే భూమిని స్వాధీనం చేసుకున్నందున నిర్వాసితులు భూమి లేని కూలీలుగా మారారన్నారు. భూ సేకరణ 2013 చట్టం ప్రకారం ఆర్ అండ్ఆర్ ప్యాకేజీని వేములఘాట్ పరిధిలోని తురబంజేరుపల్లికి చెందిన 44 మంది వడ్డెర కులస్తులకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి మూడేండ్లు దాటినప్పటికీ నేటికీ పొజిషన్ చూపించలేదన్నారు.
1600 మంది మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్లాట్లు చూపించలేదన్నారు. దాదాపు 600 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదన్నారు. దాదాపు 800 మంది ఒంటరి మహిళలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, 400 ఎకరాలకు నష్టపరిహారం నేటికీ అందించలేదన్నారు. ధర్నాలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు, హైకోర్టు న్యాయవాది దివాకర్, నిర్వాసితులు నర్సింహులు, కనకయ్య, రుకయ్య, నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.