మెదక్, జనవరి 8 (నమస్తే తెలంగాణ)/జహీరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది. చిప్పల్తుర్తిలో అత్యల్పం గా 10.7 ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం, తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తున్నాయి. ఉదయం పొగమంచు కమ్ముకుంటున్నది. ఫలితంగా రహదారులపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత పెరగడంతో దీర్ఘకాలిక రోగులతో పాటు పిల్లలు, వృద్ధు లు, మహిళలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు.
మారిన వాతావరణంతో జలుబు, దగ్గు, శ్వాసకోశ సం బంధ సమస్యలు ముదురుతున్నాయి. అనారోగ్య సమస్యలతో దవాఖానలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి బాగా ఎత్తులో ఉండడం తోపాటు ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి నుంచి రక్షణకు చలిమంటలు కాచుకుంటున్నారు. వెచ్చదనం కోసం ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. స్వెటర్లు, మప్లర్లు, మంకీ క్యాపుల విక్రయాలు బాగా పెరిగినట్లు వ్యాపారులు తెలుపుతున్నారు.
ఒకవైపు చలి తీవ్రత పెరిగిది.. మరోవైపు కొత్తరకం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్క్ ధరించాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. కొత్త రకం ఫ్లూలో దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తోంది. బీపీ, షుగర్, మధుమేహం, క్యాన్సర్, గుండె, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం చలికాలం నేపథ్యంలో వాతావరణంలో వస్తున్న మార్పులతో జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వేధిస్తుంటాయి. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. వేడినీళ్లు తప్పకుండా తాగాలి. తగి న ఆరోగ్య జాగ్రత్తలతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి.
-శ్రీరాం, డీఎంహెచ్వో, మెదక్