కంది, అక్టోబర్ 29: పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలుగా మారాయని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కందిలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ నాటిన మొక్కలు, సంతరించుకున్న పచ్చదనం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రకృతి వనంలో మరిన్ని మొక్కలు నాటి పచ్చదనం పెంచి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాలన్నారు. ప్రధాన రహదారిపై ఉన్న ఈ ప్రకృతి వనం ముందు టీ స్టాల్ ఏర్పాటు చేస్తే బాటసారులకు రిలాక్స్‌గా ఉంటుందన్నారు. మహిళా మండలి సభ్యులు టీ స్టాల్ నడిపేందుకు ముందుకు రావడంతో వారిని కలెక్టర్ అభినందించారు.
మొబైల్ క్యాంటీన్ ఏర్పాటుకు శ్రీనిధి ద్వారా రుణం ఇప్పించ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఎక్కడా లేనివిధంగా ప్రకృతి వనంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఎంపీడీవో విశ్వప్రసాద్‌ను అభినందించారు. అనంతరం ఎంపీడీవో విశ్వప్రసాద్ మాట్లాడుతూ పల్లెప్రకృతి వనంలో 26రకాలకు చెందిన 2100 మొక్కలు నాటామని, చిన్నారులు ఆడుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రజలు పల్లెప్రకృతి వనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. పక్కనే ఉన్న నాగులమ్మ ఆలయంలో కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, తహసీల్దార్ విజయలక్ష్మి, సర్పంచ్ విమలావీరేశం, టీఆర్ఎస్ నాయకులు నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.