సంగారెడ్డి, ఫిబ్రవరి 6: హైదరాబాద్ మల్టీజోన్-2 రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారని ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. ట్రాన్స్ఫర్ అయిన వారిలో వికారాబాద్ డీటీసీ (డిస్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న పరమేశ్వర్గౌడ్ను వీఆర్ (వేకెన్సీ రిజర్వుడ్) సంగారెడ్డికి బదిలీ చేశారు. సంగారెడ్డి ఇన్స్పెక్టర్ సుధీర్‌కుమార్‌ను జిన్నారానికి, హైదరాబాద్ మల్టీ జోన్-2లో ఉన్న అనిల్‌కుమార్‌ను జోగిపేట్కు, జోగిపేటలో నుంచి నాగరాజును హైదరాబాద్ మల్టీజోన్-2కు, రాచకొండ పరిధిలోని శ్రావణ్‌కుమార్‌ను కంగ్టికి, కంగ్టి నుంచి జక్కుల హనుమంతును హైదరాబాద్ మల్టీజోన్-2కు, తాండూరులో విధులు నిర్వహిస్తున్న ఎం.రాంబాబు డీటీసీ సంగారెడ్డికి బదిలీ అయినట్లు ఎస్పీ రూపేశ్ వెల్లడించారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు తమ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జిల్లాలో ఆరుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ రాచకొండ మల్టీజోన్-2 సైబరాబాద్ కమిషనరేట్ ఐజీపీ ఆదేశాలు జారీ చేశారని ఎస్పీ రూపేశ్ తెలిపారు. సంగారెడ్డి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మెరావత్ రాజేశ్నాయక్ను పటాన్చెరు పోలీస్‌స్టేషన్, గుమ్మడిదల నుంచి లక్ష్మారెడ్డిని జహీరాబాద్ టౌన్, జహీరాబాద్ టౌన్ ఎస్సై కె.శ్రీకాంత్‌ను సీసీఎస్ సంగారెడ్డి, కొండాపూర్ నుంచి వినయ్‌కుమార్‌ను సంగారెడ్డి రూరల్, ఇంద్రకరణ్‌లో విధులు నిర్వహిస్తున్న మహేశ్వర్‌రెడ్డిని గుమ్మడిదల, సంగారెడ్డి మహి ళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కోలా సోమేశ్వరిని అమీన్పూర్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బదిలీ అయిన సబ్ ఇన్స్పెక్టర్లు వారికి కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.