చేర్యాల, మే 3: దేవాదుల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయించాలని, మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు పెండింగ్ ఉన్న సాగునీటి కాల్వ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దృష్టికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీసుకుపోయారు. శనివారం హనుమకొండ జిల్లా దేవన్నపేట పంపుహౌస్ వద్ద దేవాదుల మూడోదశ పనులను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లు వాటి పరిస్థితులు, పెండింగ్ పనుల గురించి మంత్రి ఉత్తమ్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. తపాస్‌పల్లికి మల్లన్నసాగర్ గ్రావిటీ ద్వారా నీటిని తీసుకువచ్చే పనులు 25శాతం పూర్తయ్యాయని, ఆ పనులు వేగంగా పూర్తిచేస్తే ధర్మసాగర్ నుంచి గండిరామారం మీదుగా తపాస్‌పల్లి వెళ్లే భారం తక్కువ అవుతుందన్నారు. ఫలితంగా ఘన్పూర్, పాలకుర్తి వంటి తదితర ప్రాంతాలకు నీరు ఇవ్వవచ్చని సూచించారు.
దేవాదుల ప్రాజెక్టు కెనాల్ పనులు నిలిచిపోయాయని, నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా భూమిని సేకరించి కొంతమందికి పరిహారం ఇచ్చినప్పటికీ, ఇంకా కొంతమందికి ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయినట్లు తెలిపారు. గతంలో భువనగిరిలో జరిగిన సమీక్షంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే పల్లా తెలిపారు. గత సీజన్లో నిర్వాహణ డబ్బులు ఆలస్యంగా ఇవ్వడంతో 34రోజులు మోటర్లు ఆపివేయడం దురదృష్టకరమని, ఇక నుంచి నిర్వహణ పనులకు సంబంధించిన నిధులను గ్రీన్ చానెల్ పెట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.