పటాన్చెరు, అక్టోబర్ 31: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతంలో ఇష్టారాజ్యంగా బోర్లు వేసి భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి అక్రమంగా ట్యాంకర్ల ద్వారా సమీపంలోని పరిశ్రమలకు తరలిస్తూ కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా రూ.వేలకు వేలు అక్రమార్జన చేస్తున్నారు. ఒక్క దానికి అనుమతి లేదు.. కండ్ల ముందే జరుగుతున్న జలదోపిడీని అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పాశమైలారం పారిశ్రామిక వాడలోని పరిశ్రమలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక ట్యాంకర్‌కు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక బోరు నుంచి ప్రతి రోజు 5, 6 ట్యాంకర్ల ద్వారా ఫ్యాక్టరీలకు నీటిని సరఫరా చేస్తున్నారు. పటాన్చెరు మండలంలోని ముత్తంగి, ఇస్నాపూర్, పోచారం, ఇంద్రేశం, పటాన్చెరు, కర్ధనూర్, నందగాం, పాటి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా నీటి వ్యాపారం సాగుతున్నది. రెవెన్యూ అధికారుల కనుసైగల్లో నీటిదందా సాగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో నీటి దందాపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
వ్యవసాయ బోర్ల ద్వారా అక్రమంగా లారీలు, ట్యాంకర్లలో నీటిని నింపుకొని పరిశ్రమలకు తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రసాయన, ఔషధ, ఆహార ఉత్పత్తి రంగాలకు చెందిన ఫ్యాక్టరీలకు ఎక్కువగా నీరు అవసరడం ఉండడంతో సరఫరా చేస్తున్నారు. నీటిని ఫ్యాక్టరీలకు తరలించేందుకు వ్యాపారులు గ్రౌండ్ వాటర్ అనుమతి తీసుకోవాలి. బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నీటి వినియోగం, పరిమితి, స్థలం వివరాలు, బోరు రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. స్థానిక మున్సిపాలిటీ, పంచాయతీ అనుమతి తీసుకొని ట్యాంకరుతో నీటి వ్యాపారం చేయాలంటే ముందుగా ట్రాన్స్‌పోర్టు వాహనాలకు వాణిజ్య లైసెన్స్ తీసుకోవాలి. వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది.కాలుష్య నియం
త్రణ బోర్డు (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) అనుమతి తీసుకొని, ఫ్యాక్టరీలకు సరఫరా చేసే నీరు రసాయనపరంగా సురక్షితమైందని కాలుష్య నియంత్రణ మండలి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నీటి నాణ్యత పరీక్ష సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్యాంకర్లకు వాణిజ్య వాహన లైసెన్స్, బీమా అనుమతి పత్రాలు ఉండాలి. ప్రభుత్వ అనుమతులు లేకుండా నీటి వ్యాపారం ఇష్టారాజ్యంగా చేస్తుండడంతో భూగర్భ జలమట్టం పడిపోతున్నది. భవిష్యత్‌లో నీటి కష్టాలు వస్తాయి. పంచాయతీ కార్యదర్శులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసుల కనుసైగల్లో వ్యాపారం నడుస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి.
కొందరు వ్యాపారులు వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకుని నీటి వ్యాపారం చేస్తున్నారు. రైతుకు ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 వరకు చెల్లించి, ఫ్యాక్టరీలకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల విక్రయించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు వ్యవసాయ భూముల వద్ద బోర్లు వేసి నీటి వ్యాపారం చేసే వారికి లీజుకు ఇస్తున్నారు. వారు రాత్రీపగలు తేడా లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు. బోర్లకు కొందరు ఉచిత కరెంట్ ఉపయోగిస్తున్నారని తెలిసింది. వ్యవసాయ బోర్లను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నా కరెంట్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
చర్యలు
తీసుకుంటాం…
ట్యాంకర్ల ద్వారా నీటి వ్యాపారం చేసే వారికి రెవెన్యూ శాఖ అనుమతులు ఇవ్వదు. భూగర్భ జల శాఖ అనుమతులు ఇస్తుంది. పటాన్చెరు మండలంలో ట్యాంకర్ల ద్వారా ఫ్యాక్టరీలకు నీటి సరఫరా వివరాలు భూగర్భ జలశాఖ అధికారులకు తెలిసి ఉంటుంది. అక్రమంగా నీటి వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. ట్యాంకర్ల ద్వారా ఫ్యాక్టరీలకు నీటి సరఫరా చేస్తున్న వారికి ఎంత మందికి అనుమతి ఉందో తెలుసుకొని చర్యలు తీసుకుంటాం.
– రంగారావు, తహసీల్దార్,
పటాన్చెరు