రామాయంపేట, మార్చి 30: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇసుక వ్యాపారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.అధికార పార్టీ అండతో సీజ్ చేసిన ఇసుక డంపులనే మాయంచేశారు. పట్టపగలే జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇది ఎక్కడో కాదు పీఎస్కు కూతవేటు దూరంలోనే జరగడం కొసమెరుపు. మెదక్ కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్శాఖల ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి రామాయంపేట పట్టణంలోని కామారెడ్డికి వెళ్లే రోడ్డులో ఉన్న మూడు ఇసుక డంపులను అధికారులు తమ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు.
మరుసటి రోజు ఇసుక మాఫియా దర్జాగా పట్టపగలే జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి యథేచ్ఛగా విక్రయాలు జరిపి డంపులను ఖాళీచేసింది. సీజ్ చేసిన ఇసుకను పట్టపగలే అమ్మకాలు చేపట్టడంతో పట్టణవాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అధికారులు సీజ్ చేయడం వ్యాపారులు అమ్మకాలు చేపట్టడం గమనార్హం. అధికారుల అలసత్వంతోనే వ్యాపారులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకు ఇసుక ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వ అధికారులు మరో పక్క ఇసుక సీజ్ చేసినా వ్యాపారులు అమ్మకాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండతోనే వ్యాపారులు రెచ్చిపోతున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీజ్ చేసిన ఇసుక డంపులను విక్రయించిన ఇద్దరు వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై బాలరాజు, రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు. ఎంతటి వారైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు నమోదు చేయించడమే కాకుండా జరిమానాలు విధిస్తామని వారు తెలిపారు.