నిజాంపేట, మే4 : అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో కళ్లాల వద్దే కాపలా ఉండాల్సిన దుస్థితి నెలకొంటున్నది. తాజాగా నందగోకుల్ గ్రామంలో ఐకేపీ సిబ్బంది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రెండు వారాలు అవుతున్నా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. రోజుల తరబడి రైతులు వరి కుప్పలపై టార్ఫాలిన్ కవర్లు కప్పి అక్కడే కాపాల కాస్తున్నారు. బోర్ల నుంచి సరిపడా నీళ్లు రాక వరి పొలాలు ఎండిపోయి ఉన్న కాస్త నీళ్లతో పంటను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డా రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కూడ ఆ బాధలు తప్పడం లేదు.
వాతవరణ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో అంటూ రైతులు క్షణ క్షణం భయపడుతూ ధాన్యం కొనుగోలు చేయాలని మండల,జిల్లా స్థాయి అధికారులకు రైతులు మొర పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మండల స్థాయి అధికారి ఏపీఎం రాములుకు ఏమాత్రం పట్టింపు లేదు. మండలంలో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వహణను గాలికి వదిలేశారు. ఇప్పటికైనా రైతులు స్పందించి ఇప్పటికైనా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.