కంది, జనవరి 5: ప్రపంచస్థాయిలో ఐఐటీ హైదరాబాద్కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఐఐటీహెచ్ విద్యార్థులకు అన్ని విధాలా అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. ఐఐటీహెచ్కు చెందిన విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ రూ.2.50కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంపై ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఐటీహెచ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇదే అత్యధిక ప్యాకేజీ అని సంతోషం వ్యక్తం చేశారు.
దేశానికి, సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులు ఎదగాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. బీ-టెక్ ప్లేస్మెంట్ సీజన్ మొదటి దశలో 62 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని, సగటున రూ.30లక్షల వరకు ప్యాకేజీ పొందినట్లు తెలిపారు. సర్క్యూట్ విభాగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో 83.33శాతం, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంలో 83 శాతం, గణి తం, కంప్యూటరింగ్లో 77.78 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందడంతో పాటు రూ.40లక్షల ప్యాకేజీలు అందుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ సీజన్లో గరిష్ట అంతర్జాతీయ పరిహారం సంవత్సరానికి రూ.2.50కోట్ల ప్యాకేజీ విద్యార్థి అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరో ఇద్దరు విద్యార్థులు రూ.1.1కోట్ల ఆఫర్లు పొందారని, నలుగురు విద్యార్థులు రూ. 75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆఫర్లు అందుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు లక్ష్యం, సంకల్పంతో ముందుకుసాగి మంచి ప్యాకేజీలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.