కంది, అక్టోబర్ 15 : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో బుధవారం ట్రైజియో టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అశోక్ వేములపల్లి అంతస్తును ప్రారంభించారు. అశోక్ వేములపల్లి సాంకేతిక దూరదృష్టి, పరిశ్రమలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఆయన భార్య సునీతా వేములపల్లి భర్త పేరుతో ఈ అంతస్తును ఐఐటీహెచ్కు అంకితం చేశారు.
ఈ సందర్భంగా అశోక్ వేములపల్లి మాట్లాడుతూ..నూతన ఆవిష్కరణల భవిష్యత్తును నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రొఫెసర్లు, విద్యార్థులతో తన వ్యాపార అనుభవాలు, పరిశ్రమ దృక్పథం పంచుకున్నారు. సునీతా వేములపల్లి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ తమకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం గుర్తింపుకే కాదని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, యువ మేధావులను తీర్చిదిద్దడం, తన భర్త జీవిత కృషిని ప్రతిబింబించే సాంకేతిక పురోగతిని కొనసాగించాలన్న సంకల్పంతో చేసినట్లు తెలిపారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి ఈ అంతస్తు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక దానం కాదని, విద్యార్థుల దృష్టి, లక్ష్యాల సమ్మేళనం అన్నారు. పరిశ్రమ ప్రతినిధులు విద్యాసంస్థలకు సాంకేతిక ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ఎలా సహకరించగలరో వేములపల్లి కుటుంబం ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.