IITH | తెలంగాణకు తలమానికం ఐఐటీహెచ్.. నేడు జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని ఐఐటీ హైదరాబాద్‌ను జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
- కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
- సంగారెడ్డి జిల్లాకు తలమానికంగా ఐఐటీ హైదరాబాద్
- కందిలో 576 ఎకరాల్లో అధునాతన క్యాంపస్ నిర్మాణం
- రెండు దశల పనులు పూర్తి, కొనసాగుతున్న మూడో దశ
- నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
IITH | సంగారెడ్డి ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని ఐఐటీ హైదరాబాద్‌ను జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల సంగారెడ్డి జిల్లా పర్యటన ఖరారు కాకపోవడంతో ఆన్లైన్లో ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జపాన్ రాయబారి సుజుకి హిరోషి, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాచికో ఇమోటో, ఐఐటీ పాలకవర్గ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పాల్గొననున్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీ ఆన్లైన్లో ప్రసంగించనున్నారు. రెండవతరం ఐఐటీ ఏర్పాటులో భాగంగా అప్పటి యూపీఏ సర్కారు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఐఐటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 18 ఆగస్టు, 2008లో జిల్లాలోని ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం కంది గ్రామంలో 576 ఎకరాలు కేటాయించగా, ఫిబ్రవరి 27, 2009లో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 20వేల మంది విద్యార్థులతో పాటు 10వేల మంది బోధన, ఇతర సిబ్బంది కోసం క్యాంపస్ నిర్మాణాన్ని 2010లో ప్రారంభించారు. భారత ప్రభుత్వం, జపాన్‌కు చెందిన జైకా సంస్థ కలిసి 2019 వరకు మొదటి దశ నిర్మాణం పనులు పూర్తి చేశాయి. జూలై 2015లో ఐఐటీ హైదరాబాద్‌ను ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి కందిలోని శాశ్వత క్యాంపస్‌లోకి మార్చారు. మొదటి దశ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం, జపాన్‌కు చెందిన జైకా కలిసి సుమారు రూ.1700 కోట్లు ఖర్చు చేశాయి.
రూ.1000 కోట్లతో రెండో దశ..
ఐఐటీ హైదరాబాద్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. పూర్తి పర్యావరణహితంగా, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా నిర్మాణం జరుగుతుంది. ఇప్పటి వరకు మొదటి, రెండో దశ నిర్మాణం పనులు పూర్తి కాగా, మరో ఆరుమాసాల్లో మూడో దశ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత నాలుగు, ఐదో దశ చేపట్టనున్నారు. రెండో దశను 2023లో కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్లతో చేపట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో మూడంతస్తుల కన్వెన్షన్ సెంటర్, అధునాతన నాలెడ్జ్ సెంటర్ నిర్మించారు. విద్యార్థుల కోసం పది హాస్టల్ భవనాలు నిర్మించారు. యువకులు, యువతుల కోసం వేర్వేరుగా హాస్టల్ ఉన్నాయి. ఎంటెక్, పరిశోధనలు చేసే జంటల కోసం ప్రత్యేకంగా నాలుగు అంతస్తుల హాస్టల్స్, ఓపెన్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, కల్చరల్ సెంటర్, 15 లెక్చర్ హాల్స్ నిర్మించారు. ఒక్కో లెక్చర్ హాల్లో 1254 మంది విద్యార్థులు కూర్చుని చదువుకునే అవకాశం ఉన్నది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, లిబరల్ ఆర్ట్స్ కోర్సులు చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా భవనాలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బీటెక్, ఎంటెక్ విద్యార్థుల కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ కోర్ ల్యాబ్ భవనాలు నిర్మించారు. క్యాంపస్‌లో ప్రత్యేకంగా రీసెర్చ్ పార్కు, స్టార్టప్ కంపెనీల కోసం ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయి.
రెండోతరం ఐఐటీల్లో ప్రత్యేక స్థానం
కందిలోని ఐఐటీ హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాకు తలమానికంగా మారింది. రెండో తరం ఐఐటీల్లో దేశంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నాలెడ్జ్ ర్యాంకింగ్‌లో ఐఐటీహెచ్ మూడో స్థానం, నిర్ఫ్ ర్యాంకింగ్‌లో పదిలోపు స్థానంలో ఉంది. ఐఐటీ లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీతో పాటు అనేక కొత్త కోర్సులను అందజేస్తోంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్ కోర్సును ప్రారంభించింది. ఇక్కడ 4800 మంది విద్యార్థులు, 300 మందికిపైగా ప్రొఫెసర్లు ఉన్నారు. ఐదు పరిశోధన కేంద్రాలున్నాయి. పరిశోధనలపై ఐఐటీహెచ్ రూ.900 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తోంది. 5జీ, 6జీ టెక్నాలజీ రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇతర ఏజెన్సీలతో కలిసి 1668 కొత్త ప్రాజెక్టులపై పరిశోధనలు చేస్తుంది. ఐఐటీహెచ్ నుంచి 135 స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఇవి ప్రతిఏటా రూ.800 కోట్లకుపైగా ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ఐఐటీహెచ్‌లో విద్యనభ్యసించిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించి మంచి వేతనాలు పొందుతున్నారు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

