సిద్దిపేట, జనవరి 26: తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ విజన్‌తోనే బీసీ బాలికల గురుకులాలు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చింతమడక మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఆయన విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో టెన్త్ విద్యార్థులకు అల్పాహారం, డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణీ చేశారు.
సిద్దిపేట పట్టణంలోని క్రాంతిసూల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ సూళ్లు వచ్చాయన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో 16 మాత్రమే బీసీ గురుకులాలు ఉంటే వాటిని 350కి పెంచారని గుర్తుచేశారు. విద్యార్థి జీవితంలో పదోతరగతి చాలా కీలకమైందన్నారు. స్వచ్ఛ సిద్దిపేటలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాను టెన్త్ ఫలితాల్లో మొదటి స్థానంలో ఉండేందుకు నా వంతు ఐదేండ్ల నుంచి ప్రత్యేక క్లాసులు చెప్పిం చి, సొంత డబ్బులు రూ. 5లక్షలతో స్నాక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. టెన్త్ విద్యార్థులకు రూ. 5లక్షలతో డిజిటల్ కంటెంట్ బుక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. మెరుగైన ఉత్తీర్ణత పెంచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్న తీరును అభినందించారు.
ఇదే స్ఫూర్తితో సిద్దిపేట జిల్లాలో 100శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. బాలికలకు 50శాతం బీసీ గురుకులాలు ప్రారంభించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అన్ని బీసీ గురుకులాలను కేసీఆర్ ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశారన్నారు. 35బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యం కనబర్చాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన విద్యార్థులకు సొంతంగా ఐప్యాడ్ కొనిస్తానన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ సూల్లో చదివిన 11మంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధించారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మెడికల్ విద్యను పేద, మధ్య తరగతి పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామ న్నారు. వచ్చే ఏడాది సిద్దిపేట మెడికల్ కాలేజీలో 200 మెడికల్ సీట్లు పెంచుతామన్నారు.
క్యాన్సర్ సేవలు మరింత మెరుగుపడాలి
సిద్దిపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో క్యాన్సర్ సేవలు మరింత మెరుగుపడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఐసీయూలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మం దులు బయటకు రాయవద్దని, మందులు దవాఖానలో అందుబాటులో ఉంచాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐసీయూలో రూ.12 లక్షల విలువైన పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు నెలలుగా జీతాలు రావడం లేదని సిబ్బంది హరీశ్‌రావు దృష్టికి తీసుకువచ్చారు. రోగులతో ఆత్మీయంగా మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మోత్కు సుమలతాశంకర్, రత్నాకర్, బాలరాజు, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్ర యాదయ్య, నాయకులు పూజల వెంకటేశ్వరావు(చిన్నా), పాల సాయిరామ్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు సాయి ఈశ్వర్‌గౌడ్, అరవింద్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు నిమ్మ రజనీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.