హుస్నాబాద్, ఏప్రిల్ 19: ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వచ్చే ఐదేండ్లు పార్లమెంటులో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతునవుతానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు, కక్షిదారులతో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మొదటిసారి ఎంపీగా గెలిచి తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించానని, రెండోసారి 2014లో గెలిచిన అనంతరం రూ.వెయ్యికోట్లతో కరీంనగర్ స్మార్ట్‌సిటీ, రెండు హైవేలు, ఒక రైల్వే ప్రాజెక్టు తెచ్చానని చెప్పారు.
తీగెల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, నైట్ లైట్ నిర్మాణం చేశానన్నారు. టీటీడీ నుంచి రూ. 25కోట్లు తెచ్చి వేంకటేశ్వరాలయం నిర్మాణం చేయిస్తున్నట్లు చెప్పారు. బండి సంజయ్ ఎంపీగా ఐదేండ్లలో ఐదు రూపాయలు కూడా తేలేదన్నారు. అతనికి పదవి మీద ధ్యాస తప్ప ప్రజా సమస్యల మీద ఉండదని విమర్శించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌లను శాలువాలతో సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, బీఆర్ఎస్ నాయకులు మదన్‌మోహన్‌రెడ్డి, ఎండీ అన్వర్, వంగ వెంకట్రాంరెడ్డి, రవీందర్‌గౌడ్, కన్నోజు రామకృష్ణ, ధీకొండ ప్రవీణ్, అజయ్‌కుమార్, సతీశ్, న్యాయవాదులు పాల్గొన్నారు.