హుస్నాబాద్, జూన్ 18 : అమాత్యులారా నేను హుస్నాబాద్ నియోజకవర్గాన్ని… మెట్ట ప్రాంతమైన నన్ను ఉమ్మడి రాష్ట్రంలో వెలివేసినట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్లక్ష్యానికి గురయ్యాను. తాగు, సాగునీటి కోసం తండ్లాడాను.. పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితుల్లో నా ప్రజలు, పశువులు బతుకెల్లదీసిండ్రు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నన్ను గడిచిన పదేండ్లలో అభివృద్ధి దశలోకి తీసుకెళ్తున్న తరుణంలో సర్కారు మారిపోయింది. అయినా నాకు ఇద్దరు మంత్రులు వచ్చారనే ధీమా పెరిగింది. ఇక అభివృద్ధికి కొదవుండదని అనుకుంటున్నా. కేంద్ర మంత్రిగా బండి సంజయ్, రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ అయినప్పటి నుంచి నాలో ధైర్యం రెట్టింపయ్యింది. ఇక నా అభివృద్ధికి అడ్డు ఉండదని సంబురపడుతున్నా. గడిచిన యాభై ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు మంత్రులు నాకు ఉండడం ఇదే మొదటిసారి. నాకు కేంద్ర బిం దువైన హుస్నాబాద్ పట్టణం మరో సిద్దిపేట, మరో గజ్వేల్, మరో సిరిసిల్ల, మరో కరీంనగర్ పట్టణంగా తీర్చిదిద్దుతారనే ఆశలో ఉన్నాను. నా పరిధిలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాల ప్రజలు సుభిక్షంగా ఉండేలా సాగు, తాగునీరు తెస్తారని, సకల సౌకర్యాలు కల్పిస్తారనే ఆశతో ఉన్నా. ఇన్ని ఆశలు పెట్టుకున్న నన్ను ఈ ఐదేండ్లలో ఎలా అభివృద్ధి చేస్తారనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నా..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో హుస్నాబాద్ నియోజకవర్గమైన నా వద్దకు వచ్చి బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ పోటాపోటీ హామీలు ఇచ్చారు. ఎంపీగా గెలిస్తే ఊహించని అభివృద్ధి చేస్తానని బండి సంజయ్, ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుస్నాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బాండ్‌పేపర్ రాసిచ్చి హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్ తమ మాటను నిలుపుకొంటారని ఆశిస్తున్నా. ఎన్నికల సమయం లో పోటీపడి హామీలిచ్చి కేంద్ర, రాష్ట్ర మంత్రులైన మీరిద్దరు అంతేస్థాయిలో పోటీపడి నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తారనే గంపెడాశతో ఉన్నాను. ఎన్నికలప్పుడు ఉన్న జోరు, పోటీతత్వం పదవులు పొందాక కూడా ఉంటుందా… లేక స్వలాభమే ధ్యేయంగా పనిచేస్తారా అనే అనుమానాలు నా పరిధిలోని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మీరిద్దరూ స్థానికులు కాకపోయినా నేను, నా ప్రజలు ఆదరించి అక్కును చేర్చుకున్నాం. ఆదరించిన నన్ను ఆదుకుంటారో… ఆదమరుస్తారో… చూస్తా. మీరిచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకంతో ఉన్నాను.
హుస్నాబాద్ నియోజకవర్గమైన నేను ఎన్నో దశాబ్దాలుగా రైలు కూత కోసం ఎదురుచూస్తున్నా. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ మీరైనా… నాకు రైలు కూత వినిపిస్తారా? 2019ఎన్నికల్లో నా పరిధి నుంచి రైలు మార్గం వేయిస్తానని హామీ ఇవ్వడంతో ఎంతో సంతోషించాను. కానీ, అనంతరం నన్ను విస్మరించారు. మళ్లీ 2024 ఎన్నికల్లో నా ప్రజలతో పాటు నాతోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలు మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికైనా నా ప్రజల కల నెరవేరుస్తారా… జనగామ నుంచి హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ వరకు రైలు మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. కేంద్రమంత్రి హోదాలో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారని భావిస్తున్నా. అం తకుముందు ఉన్న ఎంపీ ప్రయత్నమో లేక మీకృషి కావచ్చు గానీ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు హైవే పనులు పూర్తి కావస్తున్నాయి. రవాణా సౌకర్యం మెరుగుపడుతున్నందున నా ప్రాంతానికి పెద్దసంఖ్యలో పరిశ్రమలను మంజూరు చేయించి యువతకు ఉపాధి కల్పిస్తారని ఆశిస్తున్నా. నవోదయ పాఠశాల లేదా సైనిక్ స్కూల్ మంజూరు చేస్తే నా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి దోహదపడుతారని ఆశపడుతున్నా. నా మనవిని ఆలకిస్తారా…?
నా మెట్ట రైతులకు వరప్రదాయిన గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కాలువలు తీసి పొలాలకు నీళ్లివ్వడమే తరువాయి. రాష్ట్ర మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ …వచ్చే యాసంగి వరకైనా కాలువల నిర్మాణం పూర్తి చేసి నీళ్లిస్తారా? లేక నిర్లక్ష్యం చేసినా రైతుల అన్యాయం చేస్తారా… హుస్నాబాద్ నుంచి గెలిచి మొట్టమొదటి మం త్రిగా నియామకమైన మీపై ఎన్నో ఆశలతో ఉన్నా. ఎన్నికల సమయంలో నాకు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని నెరవేరుస్తారని ఆశిస్తున్నా. ప్రియాంకగాంధీచే హుస్నాబాద్‌కు మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇప్పించారు. కానీ, ఇప్పటి వరకు దాని ఊసు కనిపించడం లేదు. హుస్నాబాద్‌లో ఉన్న 100 పడకల దవాఖానను 250 పడకల దవాఖానగా మారుస్తామని చెప్పి అందుకు తగిన ప్రయత్నాలు మాత్రం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. హుస్నాబాద్ చుట్టూ రింగ్‌రోడ్డు వేస్తామన్నారు. కొత్తపల్లి నుంచి జనగామ వరకు హైవే రోడ్డు నిర్మాణం చేస్తానన్నారు. నన్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తమరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనే నమ్మకంతో ఉన్నా. నా నమ్మకాన్ని వమ్ము చేయరనే ధీమాతో ఉన్నా. ఏం చేస్తారో మరి.?