పటాన్చెరు, ఫిబ్రవరి 12: భవిష్య ఇంధనం హైడ్రోజన్ ఉండబోతున్నదని అమెరికాదేశం టెక్సాస్‌లోని హ్యూస్టన్ గ్లోబల్ ఎర్త్ అబ్జర్వేషన్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శర్మ ద్రోణంరాజు అన్నారు. ‘భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్’ అనే అంశంపై సోమవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్‌లో జరిగిన జాతీయస్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్బన్ ఉద్ఘారాలు లేని ఇంధనంగా హైడ్రోజన్, ప్రత్యేకించి గోల్డ్ హైడ్రోజన్‌ను వినియోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, పర్యావరణ పరిరక్షణలో ఇది కీలక భూమిక పోషించనున్నదని జోస్యం చెప్పారు.
స్థిరమైన ఇంధన వనరుగా హైడ్రోజన్ వినియోగించుకోవచ్చన్నారు. 2050 నాటికి ముందు హైడ్రోజన్ హైడ్రోకార్బన్లను 50శాతం వరకు భర్తీ చేయగల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉందని చెప్పారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పి.శ్రీనివాస్, ప్రొఫెసర్ పి.ఈశ్వర్, ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్‌తో కలిసి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి అతిథులను సత్కరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.