రామచంద్రాపురం, నవంబర్ 27: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళ్ల చెరువు, వనం చెరువు, చెలికుంట చెరువులను బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆయా చెరువులకు సంబంధించిన ఆక్రమణలపై ఆరా తీశారు. చెరువు పరిసరాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేళ్ల చెరువు, వనం చెరువు, చెలికుంట, కొల్లూర్ పెద్దచెరువుల్లో జరిగిన ఆక్రమణలపై తెల్లాపూర్ సాగునీటి సంఘం మాజీ చైర్మన్ వడ్డె నర్సింహులు హైడ్రా కమిషనర్‌కు వివరించారు.
గతంలోనే ఆయా చెరువులకు సంబంధించిన ఆక్రమణలపై హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, అందుకు సంబంధించిన పేపర్లను కార్యాలయంలో ఇచ్చానని నర్సింహులు వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల జాబితాలో తెల్లాపూర్‌కు సంబంధించిన చెరువుల వివరాలు లేవని హైడ్రా కమిషనర్ దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. ఈ విషయంపై పరిశీలన చేస్తామని కమిషనర్ చెప్పారు. మేళ్లచెరువులో మట్టి నింపి ఆక్రమణకు పాల్పడిన రాజుయాదవ్‌తో కమిషనర్ మాట్లాడారు.
ఇది తమ పట్టా పొలమని, తమకు గతంలోనే అధికారులు ఎన్వోసీ ఇచ్చారని చెప్పాడు. దీనికి స్పందించిన కమిషనర్ గతంలో ఇచ్చిన ఎన్వోసీలను రద్దు చేశామని, చెరువు ఎఫ్టీఎల్లో నింపిన మట్టిని తొలిగించాలని ఆయనకు సూచించారు. చెరువుల ఆక్రమణలపై ఇరిగేషన్ డీఈ రామస్వామిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో రెండు నెలల్లో మళ్లీ వస్తానని, చెరువుల ఆక్రమణలపై పూర్తి నివేదిక సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు హైడ్రా కమిషనర్ సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, ఇరిగేషన్ డీఈ రామస్వామి, ఏఈ సంతోషి, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.