రామచంద్రాపురం, సెప్టెంబర్16: రియల్టర్ల స్వార్థ ప్ర యోజనాలు చెరువులకు శాపంగా మారుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా చెరువులు, కుంటలను ఆక్రమిం చి వెంచర్లు చేస్తూ అమాయక ప్రజలతో చెలగాటమాడుతున్నారు. దీంతో ప్రకృతి విపతులు సంభవించినప్పుడు సాధారణ ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఎన్నో కుటుంబాలకు నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితులకు కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడమే కారణం అని చెప్పవచ్చు. చెరువులు, కుంటలకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు.
చెరువుల పరిరక్షణే ధ్యేయం అంటూ కాంగ్రెస్ సర్కార్ హైడ్రాను తీసుకువచ్చింది. కానీ, హైడ్రా పేదల ఇండ్లపైనే బుల్డోజర్లతో తమ ప్రతాపం చూపిస్తున్నది. బడా నిర్మాణ సంస్థలవైపు వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. గరీబోళ్లు వేసుకున్న గుడిసెలను కూల్చుతూ వారికి నీడను లేకుండా చేస్తున్నది. కూల్చే ముందు నోటీసులు కూడా ఇవ్వ డం లేదని హైడ్రా తీరుపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్య త ప్రతిఒక్కరిపై ఉన్నది.కానీ, ప్రభుత్వం పేదలు, పెద్దలు అని చూడకుండా అందరికీ ఒకటే న్యాయం, చట్టం అనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళ్ల చెరువు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు మేళ్ల చెరువు శిఖం 27ఎకరాలు, చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్ సుమారుగా 100ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. గతంలో గ్రామస్తులు చెరువులోనే స్నానాలు చేసేవారు. అవే నీటిని తాగేవారు. అలాంటి స్వచ్ఛమైన చెరువు మనుగడ ఇప్పుడు దయనీయంగా మారింది. చెరువు చుట్టూ బహుళ అంతస్తులు, విల్లాలు నిర్మాణం కావడంతో చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, వరద కాల్వలు ఆక్రమణకు గురయ్యాయి.
డ్రైనేజీ నీరు చెరువులోకి చేరి కలుషితమవుతున్నది. ఆక్రమణలతో రోజురోజుకు చెరువు కుదించుకుపోతున్నది. మేళ్ల చెరువు పరిరక్షణకు కొందరు గతంలో ఎన్జీటీలో కేసులు వేశారు. ఎన్జీటీ బృందం తెల్లాపూర్‌లో పర్యటించి నిర్మాణాలు కూల్చివేయాలని ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తె ల్లాపూర్కు జలవనరుగా ఉన్న మేళ్ల చెరువు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా హైడ్రా మేళ్ల చెరువుపై దృష్టిసారించి ఎఫ్టీఎల్, బఫర్‌లోని ఏలియన్స్, నివీగార్డెన్, సంకల్ప తదితర నిర్మాణాలపై చర్యలు తీసుకొని చెరువుని కాపాడాలని ప్రజ లు కోరుతున్నారు.
మేళ్లచెరువు ఎఫ్టీఎల్, బఫర్‌లో జరిగిన నిర్మాణాలకు సంబంధించి వాటికి ఉన్న ఎన్వోసీలను ఎన్జీటీ ఆదేశాల మేరకు రద్దు చేశాం. ఆ తర్వాత ఏ నిర్మాణ సంస్థకు కూడా ఇరిగేషన్ వైపు నుంచి ఎలాంటి ఎన్వోసీలు జారీ చేయలేదు. మేళ్లచెరువుకి సంబంధించిన వివరాలు ఎన్జీటీకి, హైకోర్టుకు గతంలోనే సమర్పించాం. ప్రస్తుతం కొత్త నిర్మాణాలు ఏవి మేళ్ల చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌లో జరగడం లేదు. ఎవరైనా కొత్తగా ఎఫ్టీఎల్, బఫర్‌లో నిర్మాణాలకు పాల్పడితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నాం.
– సంతోషి, ఇరిగేషన్ ఏఈ
మేళ్ల చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌లో జరిగిన నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకొని చెరువుని కాపాడాలి. ఇటీవల హైడ్రా కార్యాలయానికి వెళ్లి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చెరువులు, కుంటల ఆక్రమణపై ఫిర్యాదు చేశాం. హైడ్రా సామాన్యులపైన పం జా విసరడం కాకుండా ఒకసారి తెల్లాపూర్‌లోని చెరువుల వద్దకు వచ్చి చూస్తే తెలుస్తుంది. బహుళ అంతస్తులు, విల్లాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌లో నిర్మించినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీనిపైన హైడ్రా వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నాం.
– నర్సింహులు, సాగునీటి సంఘం మాజీ చైర్మన్, తెల్లాపూర్