రాయపోల్, నవంబర్ 24: అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో అదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇమ్మడి కిషన్ వృత్తిరీత్యా ఆర్ఎంపీ వైద్యుడు. తన మొదటి భార్య పద్మ అనారోగ్యంతో కొన్నేండ్ల క్రితం మృతిచెందింది. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మొదటి భార్య మృతి చెందడంతో రెండేండ్ల క్రితం నిర్మల్ పట్టణానికి చెందిన ప్రవీణను వివాహం చేసుకున్నాడు.
పెండ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే డబ్బుల విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. మొదటి భార్య పెద్ద కుమారుడైన శ్రీనివాస్ అతడి భార్య వల్లే గొడవలు జరుగతున్నాయని స్థానికులు తెలిపారు. ఇమ్మడి కిషన్ హన్మాన్ దీక్ష ధరించాడు. దీక్షలోనే ఆదివారం ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి తిరిగి ఆలయం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో కొడుకు శ్రీనివాస్ అతడి భార్యతో ఇంట్లోనే ఉన్నాడు.
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన భార్య అత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి భర్త కిషన్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మృతురాలి బంధువులు వచ్చే వరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచాలని స్థానికులు అడ్డుకున్నారు. మృతురాలి చేతులకు గాయాలు ఉన్నందున మృతిపై పలు అనుమానాలు ఉన్నయని, మృతురాలి బంధువులు వచ్చే వరకు ఇక్కడే ఉంచాలని స్థానికులు పట్టుబట్టడంతో పోలీసులు శవాన్ని ఇంట్లోనే ఉంచారు. మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.