జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్( Short Circuit ) జరిగి ఇల్లు పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కామిరెడ్డి మల్లారెడ్డి ( Mallareddy ) అనే రైతు చెందిన ఇంట్లో ప్రమాదవశత్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి.

జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఫైర్ రేంజర్ తో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు భారీగా చెలరేగడంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో తిండి గింజలతోపాటు బట్టలు, వస్తువులు వెండి, బంగారం ఆభరణాలు, నగదు తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.
కుటుంబ సభ్యులు ఒంటిపై ఉన్న బట్టలతోనే మిగిలిపోవడంతో బాధిత రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. సంఘట స్థలాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జహీరాబాద్ పట్టణ సమీపం రంజోల్ గ్రామ సమీపంలోని స్క్రాప్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలాన్ని జహీరాబాద్ రూరల్ పోలీసులు సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.