పటాన్చెరు, అక్టోబర్ 15: తాగునీటి సరఫరా లో నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నది. పటాన్చెరు ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి సమాంతరంగా కాలుష్య సమస్య తిష్టవేసింది. ఫార్మా, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల వ్యర్థాలు చెరువులు, కుంటలు, బోరుబావులను కలుషితం చేశాయి. పరిశ్రమలకు దగ్గర ఉన్న గ్రా మాల్లో ఎక్కడ బోరు వేసినా ఘాటైన వాసనతో కూడిన కాలుష్య నీరు బయటకు వస్తున్నది. స్థానికులు ఈ నీటిని వాడటం తగ్గించుకున్నారు. ఆరోగ్యాలకు ప్రమాదకరం అని కొందరు సుప్రీంకోర్టుకు, గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందజేయాలని కోర్టులు ఆర్డ ర్ ఇచ్చి దశాబ్దాలు దాటాయి. మిషన్ భగీరథతో ఇన్నాళ్లు సురక్షితమైన తాగునీటిని పొందిన ప్రజలకు ఇప్పుడు సర్కార్ నిర్లక్ష్యం ప్రాణాలమీదకు తెస్తున్నది.
మిషన్ భగీరథ నీటి పంపిణీలో నిర్ల క్ష్యం కారణంగా కలుషిత గ్రామాలకు పూర్తిస్థాయి లో తాగునీరు అందట్లేదు. పంపిణీ వ్యవస్థ చూసే గ్రీడ్ విఫలమై కాలుష్య గ్రామాలకు సరిపోను తాగునీరు ఇవ్వడం లేదు. ఎప్పుడు మరమ్మతులు, పైప్‌లైన్ పగిలింది వంటి సమాధానాలతో వారు కాలం వెళ్లదీస్తున్నారు. గ్రిడ్ వైఫల్యాలతో ఇస్నాపూర్, చిట్కుల్, ముత్తంగి, ఇంద్రేశం గ్రామా లు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నాయి. శరవేగంగా పెరుగుతున్న జనాభాకు సరిపోను తాగునీటిని ఇవ్వలేక పంచాయతీలు చేతులెత్తేస్తున్నా యి. నీటి సరఫరా పర్యవేక్షించే ఇంట్రా అధికారులు కూడా పైనుంచి నీరు రానిది తామేమి చేయలేమని నిస్సాహాయత వ్యక్తం చేస్తున్నారు.
గరళం సరఫరా..
ఇస్నాపూర్, ముత్తంగి, చిట్కుల్ గ్రామాల్లో మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి నీరు సరఫరా రాకపోవడంతో ప్రజలకు తాగునీరు అందజేయడం సమస్యగా మారింది. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు బోరువాటర్ను ప్రజలకు నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు. సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ ఈ నీరు ప్రమాదకరం అని తేల్చాయి. కాలుష్య గ్రామాలకు ఉచితంగా తాగునీటిని అందజేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆదేశాలిచ్చినా విస్మరిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి బోరునీటిని మిక్స్‌చేసి ప్రజలకు సరఫఫరా చేయడం విచారకరం. పరిశ్రమల ఉత్పత్తుల అవశేషాలు నీటి లో ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. యాంటీబయోటిక్స్, ఆర్సానిక్, హెవీ మెటల్స్ ఇక్కడి నీటిలో వెలుగుచూశాయని పలు పరిశోధక బృందాలు విదేశీ జర్నల్స్‌లో ప్రచురించాయి. ఈ ప్రమాదకర నీటినే ప్రజలకు తాగునీటిలో కలిపి లేదా నేరుగా సరఫరా చేస్తుండడం ప్రమాదకరం. తెలిసి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో నెట్టడం అనవచ్చు.
ఇస్నాపూర్‌లో రిపోర్టులు ఇలా..
ఈ ఏడాది మే 20న మిషన్ భగీరథ ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లెబోరేటరీ సదాశివపేట అధికారులు ఇస్నాపూర్ సంప్‌లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు. మిషన్ భగీరథ నీటితో పాటు ఈ సంప్‌లో బోరునీటిని కలపడంపై వచ్చిన అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో అధికారులు నీటిని కలుపుతున్న అన్ని బోర్ల శాంపిల్స్ సేకరించారు. అధికారులు పరిశీలించిన శాంపిల్స్‌లో వరుసగా టీడీఎస్ 286, 1046, 1215,1241,520, 864 టీడీఎస్లుగా వచ్చాయి. మంజీర నీరు, మిషన్ భగీరథ తాగునీరు 160 టీడీఎస్ నుంచి 180 టీడీఎస్ మాత్రమే ఉండాలి. 300 టీడీఎస్ వరకు మాత్రమే తాగునీటికి ఉపయోగించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్వో) తెలియజేస్తున్నది. మన దేశంలోని ఐఎస్బీ, బిస్ సంస్థలు కూడా దాదాపుగా ఇదే స్థాయి టీడీఎస్‌ను వాడాలని కోరాయి. ఇస్నాపూర్ సంప్నుంచి ఫైనల్‌గా సరఫరా అయ్యే నీరు 864 టీడీఎస్‌గా ఉంది. పీహెచ్ 7.6గా నమోదైంది. అది ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.
పైగా ఈ రిపోర్టులో సూక్ష్మమైన పరిశ్రమల వ్యర్థాల గుట్టు తేలలేదు. కేవలం తాగునీటి లక్షణాలు మాత్రమే పరీక్షించారు. హెవీమెటల్స్, ఆర్సానిక్, యాంటీ బయోటిక్స్‌కు సంబంధించిన పరీక్షలు చేయలేదు. ఈ స్థాయి నీటిని వంటలకు, తాగునీటికి, స్నానాలకు వాడితే ఇబ్బందికరం. మిషన్ భగీరథ నీరు, బోరు నీరు రెండు కలవడంతో 864 టీడీఎస్ వచ్చింది. 180 టీడీఎస్ నీటిని మాత్రమే సరఫరా చేసే మిషన్ భగీరథ అధికారులు 864 టీడీఎస్ నీటిని ప్రజలకు అందజేయడంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆందోళన కల్గిస్తున్నది. చాలాసార్లు మిషన్ భగీరథ నీరు రానిపక్షంలో నేరుగా బోరునీటినే సరఫరా చేస్తారు. ఇప్పటికే ఈ ప్రాంతం రోగాలకు నిలయంగా మారింది. పెద్దపట్టణాల స్థాయిలో దవాఖానలు వెలిశాయి. సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందజేయాలనే ఆలోచనే లేదు. కిం దిస్థాయిలో సరఫరా చేసే పంచాయతీ సిబ్బంది ప్రజలకు ఏ నీరైనా ఒకటే అని భావిస్తున్నారు. కలుషిత నీటి సరఫరా ప్రజారోగ్యానికి సవాల్‌గా మారింది.