వెల్దుర్తి : మండల కేంద్రమైన వెల్దుర్తి నుంచి జిల్లా కేంద్రమైన మెదక్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. దీంతో జిల్లా కార్యాలయాలకు, ఇతర పనుల నిమిత్తం మెదక్ వెళ్లే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. వెల్దుర్తి నుంచి ఉప్పు లింగాపూర్, రామాయిపల్లి, బండపోసాన్‌పల్లి, శెట్పల్లితోపాటు మెదక్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామాల మీదుగా పిల్లికొట్టాల వద్ద మెదక్-చేగంట ప్రధాన రహదారికి ఈ దారి కలుస్తుంది.
జిల్లా కార్యాలయాలకు మండల అధికారులతోపాటు సాధారణ ప్రజలు వెళ్తుంటారు. అదేవిధంగా ఉద్యోగులు, విద్యార్థులతోపాటు వ్యక్తిగతల పనుల నిమిత్తం వందలాది మంది ప్రజలు కూడా నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారు. వెల్దుర్తి నుంచి పిల్లికొట్టాల వరకు రోడ్డుపై పెద్దపెద్ద గోతులున్నాయి. రోడ్డు పక్కన ఉన్న మట్టి కొట్టుకుపోయి కయ్యలు కోసి ప్రమాదకరంగా ఉంది. ఈ రోడ్డు వెంట వెళ్తున్న ప్రజలు ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు గాయాలపాలయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు.
కొంతమంది వాహనదారులు దూరభారమైనా సరే ఉప్పు లింగాపూర్, గవ్వలపల్లి గ్రామాల మీదుగా మెదక్‌కు వెళ్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి రోడ్డును నిర్మించి ప్రయాణ వెతలు తీర్చాలని మండల ప్రజలు, నాయకులు కోరుతున్నారు. కానీ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలింది. ప్రభుత్వం స్పందించి వెల్దుర్తి-మెదక్ ప్రధాన రహదారిని రెండు వరుసల రోడ్డుగా నిర్మించాలని, అలాగే బండపోసాన్‌పల్లి-ఏదులపల్లి-ఉప్పులింగాపూర్ గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్డు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.