సంగారెడ్డి నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): వానకాలంలో కురిసిన అధిక వర్షాలు రైతులకు అపారనష్టం మిగిల్చాయి. సంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా పంటనష్టం జరిగింది. ప్రభుత్వం 33 శాతానికిపైగా పంటనష్టం వాటిల్లితేనే నష్టంగా పరిగణిస్తుంది. దీంతో లక్ష ఎకరాలకుపైగా పంటనష్టం వాటిల్లినప్పటికీ వ్యవసాయశాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 30వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. పంటనష్టపోయిన 28511 మంది రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తామ ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు పరిహారం చెల్లించలేదు.
వానకాలం సీజన్లో ఆరంభంలో వర్షాలు సకాలంలో పడటంతో అధిక దిగుబడుల కోసం రైతులు యూరియా, రసాయనిక ఎరువులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారు. అధిక వర్షాలు రైతుల కడగండ్లు మిగిల్చాయి. వానకాలం సీజన్లో 30వేల ఎకరాల్లో పంటనష్టపోయిన రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తున్నది. దీంతో రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కౌలు రైతులు సైతం ప్రభుత్వం అందజేసే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. 33 శాతంలోపు పంటనష్టపోయిన రైతులు ప్రభుత్వం తమకు పంటనష్ట పరిహారం అందజేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.
వానకాలం (2025-26) రైతులకు కలిసి రాలేదు. అధిక వర్షాలు రైతులను ముంచాయి. మూడు విడతలుగా కురిసన భారీ వర్షాలు జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా పంటనష్టం మిగిల్చింది. ప్రభుత్వం 33 శాతానికిపైగా పంటనష్టం జరిగితేనే పరిగిణలోకి తీసుకుంది. దీంతో వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో 28511 మంది రైతులకు చెందిన 30వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. అధిక వర్షాలతో పత్తి, కంది, వరి, సోయాబీన్, పెసర తదితర పంటలు నీట మునిగిదెబ్బతిన్నాయి. దీనికితోడు అధిక వర్షాలకు పత్తి, సోయాబీన్, పెసర తదితర పంటలు కుళ్లిపోవటంతోపాటు వర్షపునీటికి మొలకెత్తడంతో పంటలకు నష్టం జరిగింది. పత్తి పంట అధికంగా 20570 ఎకరాల్లో దెబ్బతింది.
వరి, పెసర, సోయాబీన్ తదితర పంటలు పదివేల ఎకరాల్లో నష్టం జరిగింది. ఆగస్టులో కురిసన వర్షాలకు 14 మండలాల్లోని 4706 మంది రైతులు 5548 ఎకరాల్లో పంటనష్టం చవిచూశారు. రెండో విడత సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు 12 మండలాల్లోని 15590 మంది రైతులు 17వేల ఎకరాల్లో పంటనష్టపోయారు. మూడో విడత మొంథా తుపాన్ ప్రభావంతో అధిక వర్షాలకు జిల్లాలోని 8215 మంది రైతులు 7500 ఎకరాల్లో పంటనష్టపోయారు. వానకాలంలో అత్యధికంగా 20570 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. మొదటి విడతలో 3362 ఎకరాలు, రెండోవిడతలో 10052 ఎకరాలు, మూడో విడతలో 7156 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. పంటనష్టంతో అప్పులు తీర్చలేని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు వేసిన పంటలు ఏపుగా పెరగటంతో యూరియా ఇతర రసాయన ఎరువుల కోసం రైతులు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టారు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో పంటలు వర్షంపాలయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. సీఎం ప్రకటించినప్పటికీ ఇంత వరకు జిల్లాలోని రైతులకు పరిహారం అందలేదు. కేసీఆర్ హయాంలో జిల్లాలో అధిక వర్షాలకు రైతులు పంటనష్టపోతే ఎకరాకు రూ.10వేల చొప్పున వెంటనే పరిహారం చెల్లించి రైతులను ఆదుకుంది. వానకాలం సీజన్లో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని 28511 మంది రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికితోడు 33 శాతంలోపు పంటనష్టపోయిన రైతులు, కౌలు రైతులు సైతం పంటనష్టం కోసం పడిగాపులు కాపులు కాస్తున్నారు.