పుల్కల్, సెప్టెంబర్ 28: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. వరద తీవ్రత పెరగడంతో రెండురోజులుగా నీటిపారుదల శాఖ అధికారులు 6, 11వ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
శనివారం వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆరో గేటును అధికారులు మూసివేశారు.11వ గేటు ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఇన్‌ఫ్లో 14,531 క్యూసెక్కులు రాగా, అవుట్ ఫ్లో 10,867 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు.11వ గేటు 1.50 మీటర్లు ఎత్తి 8,142 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 29.768 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.