సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి రద్దు చేసిన..ఆగిన పనుల్లో ప్రభుత్వ వెటర్నరీ కళాశాల, రంగనాయకసాగర్ టూరిజం, కోమటిచెరువు శిల్పారామం, సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగు రోడ్డు, తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం, సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హబ్, టు టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట-ఇల్లంతకుంట ఫోర్ లైన్ రోడ్డు, సిద్దిపేట-కిష్టాపూర్ రహదారి, సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం, సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మారెట్ ఉన్నాయి.
సిద్దిపేట, మార్చి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): “సిద్దిపేట అభివృద్ధిపై అకసు పెట్టుకొని ఎట్లా అడుగుపెడతావు రేవంత్‌రెడ్డి. మీరు ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా? మీకెందుకు కక్ష? బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనుల కోసం విడుదలైన రూ.1,070 కోట్లను ఎందుకు రద్దు చేశావు…? ఆ నిధులను పునరుద్ధరించి సిద్దిపేట నియోజకవర్గంలో అడుగు పెట్టు. కక్షపూరితంగా నువ్వు రద్దు చేసిన నిధుల గురించి.. ఆగిపోయిన పనుల గురించి సిద్దిపేట ప్రజలకు ఏం సమాధానం చెబుతావు” అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట అభివృద్ధిపై ఆనాడు మీరు చేసిన విమర్శలు, మీ ఓర్వలేనితనాన్ని మా సిద్దిపేట ప్రజలు మర్చిపోలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పనైనా చేశారా..? మీరు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఎందుకంత ఈర్ష్య. ఈ ప్రాంతానికి మీరు ఏం చేశారో చెప్పాలన్నారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో అయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో అడుగుపెడుతున్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నానన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట పేరెత్తనిదే మీకు రోజు గడిచేది కాదన్నారు. సిద్దిపేట అభివృద్ధిపై మీరు ప్రదర్శించిన ఈర్షాద్వేషాలను నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని లేఖలో పేర్కొన్నారు.
ఆనాడు కలలో కూడా సిద్దిపేటను తలచిన మీరు ఈనాడు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటుందనే విషయాన్ని మర్చిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేశారని, నిధులు రద్దు కావడంతో 27 నెలలుగా పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.1070.73 కోట్ల కేటాయింపు జరిగిందన్నారు. ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తుండగా అర్ధంతరంగా ఆ నిధులను రద్దు చేశారని పేర్కొన్నారు. దీంతో పనులన్నీ ఆగిపోయాయి. చేసిన పనులకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఈ పనులన్నీ జరిగితే సిద్దిపేట భవిష్యత్ మరోలా ఉండేది. సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన నిధులను పునరుద్ధరించాలన్నారు. అర్ధంతరంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.